Stuart Broad: జూన్ 20వ తేదీ నుండి ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ తో భారత్ 2025 – 27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ని ప్రారంభించబోతోంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇది భారత జట్టు ఆడబోతున్న తొలి సిరీస్. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ {WTC} 2025-27 సైకిల్ లో భాగం. అలాగే భారత జట్టుకు కొత్త ప్రారంభం కూడా.
అయితే ఈ సిరీస్ లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడం ఖాయం. బుమ్రా ఫాస్ట్ బౌలింగ్ కి నాయకత్వం వహిస్తాడు. తన స్వింగ్, ఖచ్చితత్వంతో ఇంగ్లాండ్ పిచ్ లపై విధ్వంసం సృష్టించగలడు. అంతేకాకుండా బూమ్రా ఓ అరుదైన ప్రపంచ రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తో ప్రారంభం కానున్న ఈ టెస్ట్ సిరీస్ లో బుమ్రా ఈ అరుదైన ఘనతను సాధించే అవకాశం ఉంది.
విదేశీ గడ్డపై ఇప్పటివరకు 31 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన జస్ప్రీత్ బుమ్రా.. 145 వికెట్లు పడగొట్టాడు. మరొక వికెట్ పడగొడితే వసీం అక్రమ్ {146} వికెట్ల రికార్డును సమం చేస్తాడు. ఇక రెండు వికెట్లు పడగొడితే విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ఆసియా పేసర్ గా అక్రమ్ ని అధిగమించి చరిత్ర సృష్టిస్తాడు. బూమ్రా ఈ ఘనత సాధిస్తే ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటాడు.
అయితే జూన్ 20వ తేదీ నుండి భారత్ – ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుమ్రాకి సంబంధించిన ఓ రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2022 జూలై నెలలో భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు. అది బంతితో అనుకుంటే మాత్రం పొరపాటే. బ్యాట్ తో రికార్డ్ సృష్టించాడు బుమ్రా. ఇంగ్లాండ్ తో జరిగిన 5వ టెస్ట్ లో బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
Also Read: Yograj Singh: Ms ధోని వల్ల 7 గురి క్రికెటర్ల జీవితాలు నాశనమయ్యాయి.. యోగ్ రాజ్ హాట్ కామెంట్స్!
భారత తొలి ఇన్నింగ్స్ లో 84వ ఓవర్ లో స్టువర్ట్ బ్రాడ్ కి బుమ్రా చుక్కలు చూపించాడు. ఈ ఓవర్ లో ఏకంగా 35 పరుగులు రాబట్టి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. అంతకుముందు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా 2003లో సౌత్ ఆఫ్రికా బౌలర్ పీటర్సన్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో 28 పరుగులు చేశాడు. ఈ రికార్డుని బుమ్రా బద్దలుకొట్టాడు. 10 వ స్థానంలో బ్యాటింగ్ కి దిగిన బుమ్రా టి-20 తరహా హిట్టింగ్ తో చెలరేగాడు. అయితే త్వరలో ఇంగ్లాండ్ తో జరగబోతున్న టెస్ట్ సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా ఇంకా ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు క్రీడాభిమానులు.