IND vs ENG 3rd test: భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ రసవత్తరంగా మారింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మూడవ టెస్ట్ మ్యాచ్ పై పట్టు బిగించిన భారత జట్టు.. బ్యాటింగ్ లో మాత్రం ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయింది. 193 పరుగుల సాధారణ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు.. నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి 17.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.
Also Read: InD vs eng 3rd test: జులై 14వ తేది…బెన్ స్టోక్స్ కు లక్కీ డే.. ఇండియాను చిత్తు చేయడం గ్యారెంటీనా
నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి క్రీజ్ లో కేఎల్ రాహుల్ {33*} ఉండగా.. యశస్వి జైష్వాల్ {0}, కరుణ నాయర్ {14}, గిల్ {6}, నైట్ వాచ్మెన్ గా బరిలోకి దిగిన ఆకాష్ దీప్ {1} పెవిలియన్ చేరారు. ఇక భారత జట్టుకు విజయం కోసం ఇంకా 135 పరుగులు అవసరం ఉండగా.. చివరి రోజు ఆట ప్రారంభమైంది. మూడవ టెస్ట్ చివరి రోజు ఆరంభంలోనే భారత జట్టుకి షాక్ తగిలింది.
టీమిండియా వరుస వికెట్లు కోల్పోయింది. రిషబ్ పంత్ అవుట్ అయిన కాసేపటికే కే.ఎల్ రాహుల్ కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం వాషింగ్టన్ సుందర్ డకౌట్ అయ్యాడు. 12 బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కేఎల్ రాహుల్ 58 బంతుల్లో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో రవీంద్ర జడేజా {10*}, నితీష్ కుమార్ రెడ్డి {3*} ఉన్నారు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే వీరి భాగస్వామ్యం చాలా కీలకం. అలాగే ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే ఇంకా 106 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే 7 వికెట్లు కోల్పోయిన భారత జట్టు కేవలం 87 పరుగులు మాత్రమే చేసింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, కెప్టెన్ బెన్ స్టోక్స్ 2, బ్రైడెన్ కార్స్ 2 వికెట్లు పడగొట్టారు. చివరి రోజు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పైనే టీమ్ ఇండియా విజయ అవకాశాలు ఆధారపడ్డాయి. కానీ వీరిద్దరూ పెవిలియన్ చేరారు. నాలుగవ రోజు ఇంగ్లాండ్ తమ రెండవ ఇన్నింగ్స్ లో 192 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. దీంతో భారత జట్టు గెలుపు కోసం 193 పరుగులు అవసరం అయ్యాయి. ఇక మొదటి ఇన్నింగ్స్ లో ఇరుజట్లు 387 పరుగులతో సమానంగా నిలిచాయి. కానీ రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం భారత టాప్ ఆర్డర్ తడబడింది.
Also Read: IND VS ENG: టీమిండియా కొంపముంచుతున్న 24 పరుగులు… ఇంగ్లాండ్ ను తట్టుకొని ఇవాళ నిలుస్తారా !
93 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు ఈ లార్డ్స్ మైదానంలో మొత్తం 19 మ్యాచులు ఆడింది. ఇందులో 12 మ్యాచ్ లలో ఓడిపోగా.. కేవలం 3 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. ఈ మూడు విజయాలలో లక్ష్యాన్ని చేజ్ చేసి గెలిచింది మాత్రం ఒక్కసారే. 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారతీయ జట్టు ఈ మైదానంలో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో 2014లో 95 పరుగుల తేడాతో గెలుపొందగా.. 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో 150 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.