Gautam Gambhir on his first Test assignment as India coach: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా ఎన్నో అంచనాలతో వచ్చిన గౌతం గంభీర్ కి ప్రారంభం అంత కలిసి రాలేదు. శ్రీలంక సిరీస్ తో ప్రారంభమైన ఆయన ప్రయాణంలో లాభనష్టాలు సమపాళ్లలో వచ్చాయి. సూర్యకుమార్ కెప్టెన్సీలో టీ 20 సిరీస్ ను 3-0తో గెలిస్తే, రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే సిరీస్ ను 0-2తో పరాజయం పాలైంది.
కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు.. ఇక్కడెన్నో అంశాలు పనిచేశాయి. ముఖ్యంగా మూడు వన్డేల్లో రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. దాంతో శ్రీలంక కెప్టెన్ పిచ్ పరిస్థితిని అడ్డం పెట్టుకుని, ఫస్ట్ బ్యాటింగ్ చేసి.. ఛేజింగ్ టీమ్ ఇండియాకిచ్చాడు. దీంతో పిచ్ అనూహ్యంగా టర్న్ అయ్యి, శ్రీలంక సెకండ్ గ్రేడ్ స్పిన్నర్లకి కూడా మన సూపర్ స్టార్లు వికెట్లు సమర్పించుకున్నారు.
అంతేకాకుండా కోచ్ గా గౌతంగంభీర్ మొత్తం ప్రయోగాలన్నీ ఇక్కడే చేశాడు. టాపార్డర్ మార్చాడు. అలాగే బౌలర్లని మార్చాడు. మొత్తానికి జట్టులోని ప్రతి ఆటగాడిపై ఒక అంచనాకి వచ్చాడు. వీళ్లు ఇక్కడైతేనే ఆడగలరు. లేదంటే లేదని అనుకున్నాడు. ఈ క్రమంలో అనుభవంతో పాటు తనకి బహుమతిగా సిరీస్ ఓటమి వచ్చింది.
ఇప్పుడందుకే ఇంక ప్రయోగాల జోలికి వెళ్లేలా కనిపించడం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టుపై.. సొంతగడ్డపై గెలిచి పాయింట్లు పెంచుకోవాలి. అప్పుడే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓడిపోవడం, గెలవడం కన్నా.. అక్కడ ఫైనల్ ఆడాలి.. అంతవరకు ఎలా గంభీర్ నడిపిస్తాడనే అంశంపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది.
Also Read: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్ అతడే..రోహిత్, పాండ్యా ఔట్?
గౌతంగంభీర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అందరికీ అతని గురించి తెలుసు. టీ 20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ గెలిచిన రెండు సందర్భాల్లోనూ జట్టులో ఉన్నాడు. అలాగే ఐపీఎల్ లో కోల్ కతా కెప్టెన్ గా, మెంటార్ గా కూడా టైటిల్స్ అందించాడు. ఇదంతా ట్రాక్ రికార్డ్. మరిప్పుడు కోచ్ గా ఎలా ఉండబోతోందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.
రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమ్ ఇండియా బోల్తా కొట్టింది. అయితే ఇప్పటికి పాయింట్లలో నెంబర్ వన్ గా ఉంది. కచ్చితంగా ఫైనల్ లో టీమ్ ఇండియా ఆడుతుందని అందరూ అనుకుంటున్నారు. మరి ఈసారైనా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ అవుతుందా? లేదా? అనేది చూడాలి. అలా జరిగితే రోహిత్ కెప్టెన్సీకి.. మరింత వన్నె పెరుగుతుంది.