India vs Sri Lanka 3rd ODI Dream11 prediction: ఒకప్పుడు టీమ్ ఇండియా ఎలా ఉండేదంటే, పీకల మీదకు తెచ్చుకున్నాక కళ్లు తెరిచేది. అప్పుడందరూ వళ్లు దగ్గర బెట్టుకుని ఆడేవారు. అదృష్టం కలిసొస్తే ముందడుగు వేసేవారు. లేదంటే అంతే సంగతి ఇంటి ముఖం పట్టేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. వన్డే 2023 వరల్డ్ కప్ కానీ, టీ 20 ప్రపంచకప్ విషయాల్లో అలాంటి పరిస్థితి లేదు. ఏకధాటిగా విజయాలు సాధిస్తూ వెళ్లింది.
కరెక్టు ట్రాక్ ఎక్కిందని అనుకునేలోపు, శ్రీలంకలో మళ్లీ టీమ్ ఇండియా పాత ట్రాక్ లోకే వెళ్లిపోయింది. గెలవాల్సిన మొదటి వన్డేను ఓడగొట్టారు. మరి క్రీజులోకి వచ్చేటప్పుడు అర్షదీప్ సింగ్ కి సింగిల్ రన్ కదా.. జాగ్రత్తగా ఆడమని ఎవరూ చెప్పలేదా? అని నెటిజన్లు దుయ్యబట్టారు. ఇదే కదా హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్ లు చేయాల్సిన పని అని అంటున్నారు.
అర్షదీప్ కి అలా చెప్పకపోవడం వల్లే షాట్ కి ట్రై చేశాడని, గెలవాల్సిన మ్యాచ్ ని టై చేశాడని అంటున్నారు. ఇప్పుడదే పొరపాటు గ్రహపాటుగా మారింది. రెండో వన్డేలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వ్యవహారం పీకలమీదకు వచ్చింది. అదే గెలిచి ఉంటే, మూడోది కూడా గెలిస్తే సిరీస్ వశమయ్యేది. ఇప్పుడిది ఓడితే ఇంతే సంగతి. 27 ఏళ్ల తర్వాత సిరీస్ ని కోల్పోయిన చెత్త రికార్డు సొంతమవుతుంది.
Also Read: ఒక్కటి విసిరాడు..ఫైనల్ లో పడ్డాడు.. నీరజ్ చోప్రాకి పతకం గ్యారంటీ!
చావో రేవో ఆడాల్సిన మ్యాచ్ నేడు కొలంబోలో ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనుంది. రెండో వన్డేలో పేస్ బౌలింగు లో సిరాజ్ ఫర్వాలేదనిపించినా, అర్షదీప్ తేలిపోయాడు. అందుకే మూడో వన్డేలో తనని పక్కన పెట్టి స్పిన్ బౌలింగు బలాన్ని పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికి ఉన్న ముగ్గురికి అదనంగా రియాన్ పరాగ్ ని కూడా తీసుకురావాలని అంటున్నారు.
ఈ రెండు మ్యాచ్ ల్లో శ్రీలంక కేవలం తన స్పిన్ బలంతోనే ఇండియాని కట్టుదిట్టం చేసింది. మొదటి పది ఓవర్లలో రోహిత్ శర్మ, గిల్ ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతున్నారు. వారు అవుట్ అయిన దగ్గర నుంచి మిడిలార్డర్ వైఫల్యం ఘోరంగా ఉంది. కొహ్లీ, శ్రేయాస్, రాహుల్ అంతా ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయిపోతున్నారు. ఈ పరిస్థితి మారాలని కెప్టెన్ రోహిత్ శర్మ బహిరంగంగా వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మరి కీలకమైన మూడో వన్డేకు భారత్ ఎలాంటి అస్త్ర శస్త్రాలతో వస్తుందో వేచి చూడాల్సిందే.