Asia Cup 2025 : ఆసియా కప్ 2025 మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం అవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును మరో వారంలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలోనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్్ జపాన్ పర్యటనకు వెళ్లడం పై ఇప్పుడు పలు సందేహాలకు తావిస్తోంది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్ నెస్ విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకొని కోలుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ నకు ముందు జపాన్ పర్యటనకు వెళ్లడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. సూర్య కుమార్ యాదవ్ జపాన్ కి వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లాడా..? లేక మరేదైనా చికిత్స తీసుకునేందుకు వెళ్లాడా అనేది స్పష్టత లేకపోవడంతో అభిమానులు, క్రికెట్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
Also Read : IPL 2026 : CSK సంచలన నిర్ణయం..10 స్టార్ ప్లేయర్లను వదిలేయాలని ధోని ఆదేశాలు ?
ఐపీఎల్ 2025 సీజన్ తరువాత సూర్యకుమార్ యాదవ్ జర్మనీలోని మ్యూనిచ్ లో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. ఈ సర్జరీ విజయవంతమైందని.. అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్ నెస్ సాధించేందుకు కసరత్తులు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇటీవల అతను నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆసియా కప్ ఆడేందుకు సూర్యకుమార్ అందుబాటులో ఉంటాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆసియా కప్ కోసం భారత జట్టు ఎంపిక కోసం మరికొద్ది రోజుల ముందే సూర్యకుమార్ యాదవ్ జపాన్ కి వెళ్లినట్టు ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పర్యటన గురించి వాస్తవానికి అధికారిక ప్రకటన లేకపోవడంతో అతని ఫిట్ నెస్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలా జరగడం చాలా అరుదు..
సాధారణంగా ఒక ఆటగాడు గాయం నుంచి కోలుకుంటున్నప్పుడు దేశం విడిచి వెళ్లడం చాలా అరుదు. దీంతో అతను ఏదైనా అదనపు చికిత్స కోసమో.. లేదా అతని ఫిట్ నెస్ లో ఏదైనా సమస్య ఉందనే ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా టీ-20 జట్టుకు కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ కి దూరమైతే.. అది జట్టు పై తీవ్ర ప్రభావం చూపుతుంది. గతంలో రోహిత్ శర్మ టీ-20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న తరువాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి.. తన నాయకత్వంలో జట్టుకు అద్భుతమైన విజయాలను అందించాడు. ఇప్పుడు అతను అందుబాటులో లేకపోతే.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. లేదంటే.. జట్టు కూర్పు, వ్యూహాల విషయంలో చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ విషయం పై స్పష్టత వచ్చాక నే జట్టును ప్రకటిస్తుందని తెలుస్తోంది. సూర్యకుమార్ జపాన్ పర్యటన ఆసియా కప్ స్క్వాడ్ ఎంపిక పై ఒక రకమైన సస్పెన్స్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. మిస్టర్ 360 పూర్తి ఫిట్ నెస్ సాధించి జట్టుతో చేరతాడా..? లేదా అనేది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.