IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్ లు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. మే 08న రద్దు అయిన ఐపీఎల్ మ్యాచ్ లు మే 17న పున:ప్రారంభం కానున్నాయి. మిగిలిన మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ ని నిన్న రాత్రి బీసీసీఐ ప్రకటించింది. మే 08న 10 ఓవర్ల పాటు సాగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఈనెల 24 నుంచి మొదటి నుంచి నిర్వహించనున్నారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ కి నిన్న ప్రకటించిన రీ షెడ్యూల్ కి చాలా తేడాలు ఉన్నాయి. వేదికలు చాలా వరకు మారాయి. ప్లే ఆప్స్, ఫైనల్ మ్యాచ్ ల వేదికలు ఖరారు కావాల్సి ఉంది. జూన్ 3 న జరిగే ఫైనల్ తో ఐపీఎల్ ముగుస్తుంది.
Also Read : Virat Fans : చిన్నస్వామి స్టేడియంలో 50 వేల మంది కోహ్లీలు.. గూస్ బంప్స్ రావాల్సిందే
అయితే ఈ సారి వేదికలను మార్చేసారు. ఐపీఎల్ రీ షెడ్యూల్ లో తొలుత సౌత్ వేదికలే ఖరారు అవుతాయని.. నార్త్ వేదికల్లో పాకిస్తాన్ దాడులు జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం మాత్రం ఒక్క బెంగళూరు మినహా మిగతా సౌత్ వేదికలకు ఛాన్స్ దక్కలేదు. చెన్నై, హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాలకు ఛాన్స్ దక్కకపోవడానికీ కారణం ఈ రెండు జట్లు ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించడమే అని కొందరూ పేర్కొంటున్నారు. మరికొందరూ మాత్రం ప్రస్తుతం దక్షిణాది వైపు రుతుపవనాలు కదలిక వేగంగా ఉందని.. దీంతో హైదరాబాద్, చెన్నై, వైజాగ్ వంటి ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ వేదికల్లో మిగిలిన మ్యాచ్ లను మార్చినట్టు సమాచారం. మరోవైపు ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, కోల్ కతా, లక్నో వేదికలకు వర్షం ముప్పు చాలా తక్కువ అని.. సౌత్ కి బదులు నార్త్ వేదికలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ సాధిస్తుందని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్న విషయం విధితమే. ఇప్పటివరకు అద్భుతమైన ఫామ్ కనబరిచిన ఆర్సీబీ జట్టు ఇక మిగిలిన మ్యాచ్ ల్లో నష్టపోనున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ వాయిదా పడటం.. ప్లే ఆప్స్ కి దగ్గరగా ఉన్న ఈ జట్టుకి దెబ్బ పడింది. ఆర్సీబీ ఆడబోయే మ్యాచ్ లకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా కి చెందిన కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఐపీఎల్ పూర్తి కాక ముందే ఇంగ్లండ్-వెస్టీండిస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అలాగే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆటగాళ్లు టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుండటంతో తొలి ప్రాధాన్యత దానికే ఇవ్వనున్నారు. అయితే ఐపీఎల్ ముగిసిన తరువాత వారం రోజులకు టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. కానీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తుది నిర్ణయం ఆటగాళ్లకే వదిలేసింది. ఇక ఆర్సీబీలో టిమ్ డేవిడ్ మినహా ఒక్క విదేశీ ఆటగాడు కూడా మిగిలే అవకాశం లేకపోలేదు. శ్రీలంక పేసర్ నువార్ తుషార ఉన్నా అతను అందుబాటులో ఉంటాడో.. ఉండడో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఐపీఎల్ వాయిదా పడటం ఆర్సీబీ కి కోలుకోలేని దెబ్బ పడిందనే చెప్పవచ్చు.