King Charles – India team : ప్రస్తుతం టీమిండియా మెన్స్, ఉమెన్స్ క్రికెట్ జట్లు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే నేపథ్యంలో ఇవాళ తాజాగా కింగ్ ఛార్లెస్ III తో సమావేశమయ్యారు. ఇంగ్లాండ్ లో పర్యటించిన ఇంగ్లాండ్, భారత జట్ల ఆటగాళ్లను రాజు పలుకరించి వారితో కరచలనం చేసారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా పురుషులు, మహిళల జట్ల ఆటగాళ్లతో కించ్ ఛార్లెస్ మాట్లాడారు. అనంతరం వీరితో కలిసి కొన్ని ఫొటోలు కూడా దిగారు. ఛార్లెస్ రెండు జట్ల కోచ్ లతో సహా వారి సహాయక సిబ్బందితో కలిసి ఫొటోలు దిగడం విశేషం.
ఇది చారిత్రాత్మక ఘట్టం..
ఛార్లెస్ III తో కలిసిన తరువాత భారత ఉమెన్స్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడారు. కింగ్ ఛార్లెస్ ని కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మేము మొదటి సారిగా రాజును కలిశామని.. ఇది సంతోషకరమైన అనుభవం అని చెప్పుకొచ్చారు. అతను చాలా స్నేహపూర్వకంగా మాతో ఉన్నాడు. మేము భారత్ తరపున మంచి క్రికెట్ ఆడుతున్నాం. మాకు చాలా అవకావాలు లభిస్తున్నాయని తెలిపింది. భారత ప్రభుత్వం మాకు మంచి సపోర్టు ఇస్తుందని.. మాకు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రోత్సహించడంతో అద్భుతంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. ఇదిలా ఉంటే.. భారత జట్ల పై ఛార్లెస్ భేటీ పై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా స్పందించారు. కింగ్ ఛార్లెస్ III మెన్స్, ఉమెన్స్ భారత క్రికెట్ జట్లను ఆహ్వానించడం చాలా చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు. అతన్ని కలిసిన తరువాత ఆటగాళ్లు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు.
సిరీస్ గెలుస్తాం : రాజీవ్ శుక్లా
తాను రాజుకు ఓ పుస్తకం ఇచ్చాను.. ఆ పుస్తకం గురించి అడిగాడు. భారత క్రికెటర్ ఆకాశ్ దీప్ సోదరి ఆరోగ్యం గురించి కూడా అడిగి తెలుసుకున్నాడని శుక్లా చెప్పారు. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ కి సంబందించి మేము రాజుతో చర్చించామని.. మహ్మద్ సిరాజ్ ని ఔట్ చేయడం చాలా దురదృష్టకరమని రాజు చెప్పాడు. భారత్ మ్యాచ్ గెలిచి ఉండేదని.. అయినప్పటికీ పోరాడామని.. సిరీస్ గెలుస్తామని శుక్లా తెలిపాడు. ప్రస్తుతం భారత్ మెన్స్ జట్టు 5 టెస్టుల సిరీస్ లో ఆడుతుండగా.. మహిళల జట్టు ఐదు టీ-20 మ్యాచ్ లు.. 3 వన్డే మ్యాచ్ లను ఆడనున్నాయి. లార్డ్స్ లో మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టీమిండియా టెస్టు సిరీస్ లో 1-2తో వెనుకంజలో ఉంది. హర్మన్ ప్రీత్ జట్టు ఇటీవలే ఇంగ్లాండ్ పై టీ-20 సిరీస్ ను గెలుచుకుంది. ఇంగ్లాండ్ గడ్డ పై 3-2 తో విజయం సాధించింది భారత మహిళల జట్టు. మహిళల జట్టు జులై 16 నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. పురుషుల జట్టు జులై 23 నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగే నాలుగో టెస్ట్ ఆడనుంది. దాదాపు ఎనిమిదిరోజుల విరామం ఉంటుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు.