Maxwell vs Klaasen| సౌత్ ఆఫ్రికా పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్, ఆస్ట్రేలియా డైనమిక్ ఆల్-రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఇద్దరూ తమ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లకు వీడ్కోలు పలికారు. క్లాసెన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే మాక్స్‌వెల్ వన్డే క్రికెట్ కు మాత్రమే తప్పుకున్నాడు. అయితే వీరిద్దరిలో ఒక కామన్ విషయం ఉంది. ఇద్దరూ వన్డేలలో మంచి ఫినిషర్లుగా పేరు తెచ్చుకున్నవారే. చివరి 10 ఓవర్లలో (40 నుండి 50 ఓవర్లు) జట్టును గెలిపించడం, ఆటను మలుపుతిప్ప గలిగే సత్తా ఉన్న ఫినిషర్లు వీరు. ఇద్దరూ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంతో వీరి అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇద్దరిలో ఎవరు బెటర్ ఫినిషర్? అని.ఇద్దరి ఆటతీరును చివరి 10 ఓవర్లలో పోల్చి చూస్తే ఎవరు బెటర్ ఫినిషర్ అనేది తెలుస్తుంది.
హెన్రిచ్ క్లాసెన్ 21 ఇన్నింగ్స్‌లలో 330 బంతుల్లో 570 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 172.7, మొత్తం ఇన్నింగ్స్ లో 35 సిక్సర్లు కొట్టాడు. ఇది చాలా అద్భుతమైన గణాంకాలు.
మరోవైపు, గ్లెన్ మాక్స్‌వెల్ 58 ఇన్నింగ్స్‌లలో 1,033 బంతుల్లో 1,750 పరుగులు సాధించాడు, స్ట్రైక్ రేట్ 169.4తో. అతను 78 సిక్సర్లు బాదాడు. మాక్స్‌వెల్ ఎక్కువ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, క్లాసెన్ స్ట్రైక్ రేట్ కొంచెం ఎక్కువ, ఇది అతన్ని వేగంగా ఆటను ముగించే ఫినిషర్‌గా చూపిస్తుంది.
స్పిన్, పేస్ బౌలింగ్ ఎదుర్కోవడంలో ఎవరు బెటర్
స్పిన్ బౌలింగ్‌కు వ్యతిరేకంగా చివరి ఓవర్లలో: క్లాసెన్ 231 బంతుల్లో 406 పరుగులు చేశాడు, స్ట్రైక్ రేట్ 175.8, 23 సిక్సర్లు కొట్టాడు. మరోవైపు మాక్స్‌వెల్ 749 బంతుల్లో 1,240 పరుగులు సాధించాడు, స్ట్రైక్ రేట్ 165.6తో, 47 సిక్సర్లు అతని ఖాతాలో ఉన్నాయి.
క్లాసెన్ స్పిన్‌కు వ్యతిరేకంగా కొంచెం బెటర్ స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు, కానీ మాక్స్‌వెల్ ఎక్కువ ఇన్నింగ్స్ ఆడి, ఎక్కువ సిక్సర్లు కొట్టాడు.
పేస్ బౌలింగ్‌పై:
క్లాసెన్ 99 బంతుల్లో 164 పరుగులు, 165.7 స్ట్రైక్ రేట్‌తో, 12 సిక్సర్లు కొట్టాడు. మాక్స్‌వెల్ 284 బంతుల్లో 510 పరుగులు, 179.6 స్ట్రైక్ రేట్‌తో, 31 సిక్సర్లు సాధించాడు.
పేస్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ స్ట్రైక్ రేట్, సిక్సర్లలో ఆధిపత్యం చూపించాడు.
Also Read: పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడిన సచిన్.. ఎందుకు చేశాడంటే?..
ICC టోర్నమెంట్లలో
పెద్ద ICC టోర్నమెంట్లలో డెత్ ఓవర్లలో: క్లాసెన్ 5 ఇన్నింగ్స్‌లలో 91 బంతుల్లో 182 పరుగులు, 200 స్ట్రైక్ రేట్‌తో, 14 సిక్సర్లు కొట్టాడు. మాక్స్‌వెల్ 10 ఇన్నింగ్స్‌లలో 231 బంతుల్లో 482 పరుగులు, 208.7 స్ట్రైక్ రేట్‌తో, 27 సిక్సర్లు సాధించాడు. అయితే, అతని డాట్ బాల్ శాతం (27.3%) క్లాసెన్ కంటే కొంచెం ఎక్కువ.
మొత్తంగా చూస్తే..వన్డేలలో, క్లాసెన్ తన స్ట్రైక్ రేట్ పేస్‌కు వ్యతిరేకంగా మంచి ఆటతీరుతో కొంచెం మెరుగ్గా ఉన్నాడు. అయితే, ICC టోర్నమెంట్లలో మాక్స్‌వెల్ ఎక్కువ ఇన్నింగ్స్ అద్భుతంగా ఆడాడు. స్పిన్‌కు వ్యతిరేకంగా ఎక్కువ ప్రభావం చూపించాడు. ఇద్దరూ అద్వితీయ ఫినిషర్లు అయినప్పటికీ, అంతర్జాతీయ వేదికలపై మాక్స్‌వెల్ ప్రదర్శన.. అతడిని కొంచెం ముందంజలో నిలబెడుతుంది. కానీ ఫాస్ట్ ఫినిషింగ్ లో క్లాసెన్ బెటర్ స్ట్రైకర్.