Paris Olympics 2024: భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా తాజాగా తన తల్లి ఓ పాకిస్తాన్ అథ్లెట్ గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించగా.. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ గోల్డ్ సాధించారు. వీరిద్దరూ ఆ తర్వాత పరస్పరం అభినందించుకున్నారు. తన కొడుకు సిల్వర్ మెడల్ సాధించడంపై మీడియా ఆమె తల్లి సరోజ్ దేవిని మాట్లాడించింది. ఈ సందర్భంగా తన కొడుకు నీరజ్ చోప్రా సాధించిన విజయాన్ని ప్రశంసించారు. ఇదే సందర్భంలో గోల్డ్ మెడల్ సాధించిన నదీమ్ కూడా తనకు కొడుకులాంటివాడేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.
ఈ కామెంట్లను కొందరు సానుకూలంగా స్వీకరిస్తుండగా.. కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఉభయ దేశాల మధ్య శత్రుత్వం ఉన్నదని, అలాంటి దేశ క్రీడాకారుడిని తన కుమారుడిలాంటివాడేని పేర్కొనడాన్ని తప్పుబడుతున్నారు. కొందరు మాత్రం సరోజ్ దేవి వ్యాఖ్యలను స్వాగతిస్తూ.. తల్లి మనసు అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే స్పష్టత కోసం స్వయంగా నీరజ్ చోప్పా మీడియాతో మాట్లాడారు.
‘మా అమ్మ గ్రామీణ ప్రాంత వాసి. సోషల్ మీడియా, టీవీల్లో వచ్చే భారత్, పాక్ వ్యవహారాలేమీ ఆమెకు తెలియవు. ఆమె ఒక తల్లిగా మాత్రమే ఆ మాటలు అన్నారు. ఆమె మనస్ఫూర్తిగా మాట్లాడారు. తల్లి హృదయంతోనే నదీమ్ కూడా తనకు కుమారుడిలాంటి వాడేనని చెప్పారు. ఇది చాలా సింపుల్ స్టేట్‌మెంట్. ఈ మాట కూడా కొందరికి నచ్చకపోవడం విచిత్రంగా అనిపించింది’ అంటూ నీరజ్ చోప్రా రియాక్ట్ అయ్యారు.
Also Read: Chandrababu: టీ టీడీపీ అధ్యక్ష ఎన్నికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇక పాకిస్తాన్‌లో నదీమ్ తల్లి కూడా దాదాపుగా ఇలాగే మాట్లాడారు. నీరజ్ కూడా తనకు కుమారుడివంటివాడేనని, నదీమ్‌కు ఫ్రెండ్ అని మీడియాతో పేర్కొన్నారు. స్పోర్ట్స్ అన్నప్పుడు గెలుపు ఓటమి సహజమని, నీరజ్ చోప్రా మరిన్ని పతకాలు గెలువాలని ఆశీర్వదిస్తున్నాను అని వెల్లడించారు.