No Proposal for offshore t20i series against India says PCB Chairman Mohsin Naqvi: టీమ్ ఇండియా-పాకిస్తాన్ మధ్య టీ 20 సిరీస్ జరగనుందని నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 2012 తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగలేదు. ఎప్పుడైనా ఐసీసీ టోర్నమెంటు జరిగినప్పుడు ఒకటి, అరా మ్యాచ్ లు ఆడటం తప్ప, వాళ్లు ఇక్కడికి రావడం లేదు, మనవాళ్లు అక్కడికి వెళ్లడం లేదు. కానీ ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్ దేశాల్లో పాక్-ఇండియా మధ్య టీ 20 సిరీస్ జరగనుందని నెట్టింట వార్తలు వేడి పుట్టిస్తున్నాయి.
వీటన్నింటిని పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ కొట్టి పారేశారు. ప్రస్తుతం అలాంటి ఆలోచనేమీ లేదని అన్నారు. ఒకవేళ ఉన్నా ఎవరిదేశాల్లో వారు ఆడతారుకానీ, వేరే దేశం వెళ్లి ఆడేంతటి అవసరం లేదని అన్నారు. అదీకాక తమ ముందున్న అతిపెద్ద సవాల్ ఛాంపియన్స్ ట్రోఫీ అని తెలిపారు.
2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వరకు ఈ ట్రోఫీ జరగనుంది. ప్రస్తుతం దానిపైనే మా ఫోకస్ అంతా ఉందని అన్నారు. అంతేకాదు మా పాకిస్తాన్ జట్టు కూడా తీరిక లేని షెడ్యూల్ తో ఉంది. అందువల్ల రెండు దేశాల మధ్య సిరీస్ అనే ప్రసక్తే లేదని అన్నారు. ఇంతకీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఛాలెంజర్స్ ట్రోఫీకి అసలు భారత్ వెళుతుందా? లేదా? అనేది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
Also Read: విశ్వమంతా.. మనోళ్లే! ఒలింపిక్స్ లో భారత సంతతి క్రీడాకారులు
ఇంతవరకు భారత్ నుంచి అంగీకారం రాలేదు. అందుక్కారణం ఏమిటంటే, భారత ప్రభుత్వం అంగీకరిస్తేనే టీమ్ ఇండియా పాకిస్తాన్ పర్యటనకు వెళుతుంది. అయితే పాకిస్తాన్ మాత్రం అన్ని జట్లతోపాటు ఇండియా జట్టుని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రడీ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ షెడ్యూల్ కూడా వేసేస్తున్నారని అంటున్నారు.
అన్నింటికి మించి ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కొలంబోలో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లో చర్చ జరుగుతుందని భావించారు. కానీ అక్కడ ఉలుకు లేదు, పలుకు లేదని అన్నారు. అజెండాలో లేకపోవడంతో చర్చించలేదని చెబుతున్నారు. టోర్నీకి ఇంకా చాలా సమయం ఉందని, ఈ సంగతి ఐసీసీ చూసుకుంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.