Vinesh Phogat| ఒలింపిక్స్ లో వినేశ్ ఫోగట్ అనర్హత వివాదం భారత పార్లమెంటు వరకు చేరింది. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్స్ ముందు రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు వేయడం వివాదంగా మారడంతో.. ఈ అంశంపై చర్చలు జరపాలని రాజ్యసభలో ప్రతిపక్ష ఇండియా కూటమి గురువారం పట్టుబట్టింది. పారిస్ ఒలింపిక్స్ 50 కేజీల మహిళల కుస్తీ పోటీల ఫైనల్స్ లో అమెరికా రెజ్లర్ సారా యాన్ హిల్ బ్రాంట్ తో రెజ్లర్ వినేశ్ ఫోగట్ తలపడబోయే కొన్ని గంటల ముందు వినేశ్ ఫోగట్ నిబంధనలకు వ్యతిరేకంగా 150 గ్రాములు ఎక్కువ బరువు ఉన్నారని ఆమెపై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది.
”ఈ అంశంపై రాజ్యసభలో చర్చ జరపాలని, వినేశ్ ఫోగట్ ఒలింపిక్స్ అనర్హతపై అనుమానాలున్నాయని ప్రతిపక్ష పార్టీలు వాదించాయి. కానీ రాజ్య సభలో చర్చకు అనుమతి లభించకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. ఇండియా కూటమి వినేశ్ ఫోగట్ కు జరిగిన అన్యాయంపై చర్చ జరపాలని కోరింది. ఒలింపిక్స్ లో ఆమెకు జరిగిన అన్యాయం పట్ల మాట్లాడాలని మేము కోరాం. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. అందుకే సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం.” అని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు.
రాజ్య సభలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియాను వినేశ్ ఫోగట్‌కు ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు అందించిన ఆర్థిక వివరాలు వెల్లడించాలని ప్రతిపక్ష పార్టీలు కోరాయి. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. ”వినేశ్ ఫోగట్ కు అవసరమైన సహాయక సిబ్బందిని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారత ఒలింపిక్స్ అథ్లెట్స్ కోసం మొత్తం రూ.70, 45, 775 ఖర్చు చేయడం జరిగింది. వినేశ్ ఫోగట్ వంద గ్రాములు అధిక బరువు ఉండడం వల్ల ఆమెపై అనర్హత వేటు పడింది. వినేశ్ 50 కేజీల కేటగిరీ కుస్తీ పోటీల్లో పాల్గొనాలంటే ఆమె బరువు 50 కేజీలకు మించకూడదు. అనర్హత కారణంగా వినేశ్ ఫోగట్ ర్యాంకు చివరి స్థానానికి చేరింది. ఈ నియమం ప్రపంచ కుస్తీ పోటీలన్నింటిల్లో ఉంది.” అని కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. అయితే ఒలింపిక్స్ లోని అందరూ భారత క్రీడాకారుల కోసం మొత్తంగా చెప్పారు కానీ.. వినేశ్ ఫోగట్ గురించి మంత్రి ప్రత్యేక ఖర్చుల గురించి వివరాలు వెల్లడించలేదు. దీంతో ప్రతిపక్షాలు మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని వాదించాయి.
ఒలింపిక్స్ అనర్హత తరువాత వినేశ్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ స్పందించారు. ఆమె నిరుత్సాహ పడకూడదని.. దేశ ప్రజలందరూ ఆమెకు మద్దతుగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
Also Read: ‘మా అమ్మాయికి సాధారణ ఉద్యోగం చాలు’.. రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన యువతి తల్లిదండ్రులు!