Pakistan Champions Trophy| పాకిస్తాన్ లో జరుగబోయే ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పై రోజుకో కొత్త వివాదం తలెత్తుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా పాకిస్తాన్‌లో ఆడేందుకు సిద్ధంగా లేదని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసిసి) పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఓ లేఖ రాసింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కష్టాల్లో పడింది. ఛాంపియన్స్ ట్రోఫిలో ఇండియా కీలక టీమ్. పైగా పాకిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పడు టీమిండియా పాకిస్తాన్ లో ఆడేది లేదని స్పష్టం చేయడంతో ఈ ట్రోఫీ కళ కోల్పోతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆందోళన.
అయితే బిసిసిఐ కోరుకుంటున్నట్లు టీమిండియా ఆడే మ్యాచ్ లన్నీ హైబ్రిడ్ మాడల్ లో పాకిస్తాన్ వెలుపల దుబాయ్, శ్రీలంక లాంటి తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఐసిసి చెప్పినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వినడం లేదు. తాము ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ ప్రధాన నగరాలైన కరాచీ, లాహోర్, రావల్పిండిలో ఎంతో ఖర్చుతో అన్ని ఏర్పాట్లు చేశామని ఈ వేదికల్లోనే టీమిండియా ఆడాలని పట్టుబట్టింది.
అయితే టీమిండియా భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్ కు ప్రయాణించడం కుదరదని బిసిసిఐ తెలిపింది. కానీ పాక్ బోర్డు మాత్రం అదంతా కుదరదు.. ఇప్పటికే పాకిస్తాన్ లో ఇంగ్లాండ్, న్యూజిల్యాండ్ లతో రెండు టోర్నమెంట్లు నిర్వహించామని భద్రతా సమస్యలు లేవని చెప్పింది. అయినా టీమిండియా పాకిస్తాన్ తో క్రికెట్ టోర్నమెంట్ ఆడేందుకు బిసిసిఐ అనుమతులు ఇవ్వలేదు.
Also Read: భయంకరమైన బౌలింగ్ తో రెచ్చిపోయిన సచిన్ కొడుకు..వేలంలో భారీ ధర పక్కా !
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించినందుకు ఆతిథ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసిసి తరపున 65 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.550 కోట్లు భారత కరెన్సీ) అందుతాయి. ఒకవేళ కేవలం ఇండియా కోసం హైబ్రిడ్ మాడల్ లో బయటి దేశాల్లో కొన్ని మ్యాచ్ లు నిర్వహిస్తే.. తమకు ఫీజులో కోత ఉంటుందని.. ఈ నష్టం తామెందుకు భరించాలని పాక్ బోర్డు వాదన. అయితే హైబ్రిడ్ మాడల్ లో బయటి దేశాల్లో కొన్ని మ్యాచ్ లు నిర్వహించినా మొత్తం 65 మిలియన్ డాలర్ల హోస్టింగ్ ఫీజు ఇస్తామని ఐసిసి స్పష్టం చేసింది.
ఇంత చెప్పినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొండిపట్టుతో ఇండియా రాకపోతే అసలు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తాము వైదులుగుతామని చెప్పింది. దీనికి సంబంధించి పాక్ బోర్డు చీఫ్ మొహ్‌సిన్ నఖ్వీ ఐసిసికి ఓ లేఖ కూడా రాశారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని ఐసిసి సౌత్ ఆఫ్రికాలో నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాక్ క్రికెట్ బోర్డు చేతులారా రూ.550 కోట్లు నష్టం కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. పైగా చివరి నిమిషయంలో టోర్నమెంట్ హోస్టింగ్ రద్దు చేసినందుకు పాకిస్తాన్ పై ఐసిసి ఆంక్షలు కూడా విధించే అవకాశం ఉంది.
2012-13 లో చివరి సారిగా టీమిండియా పాకిస్తాన్ లో క్రికెట్ మ్యాచ్ లు ఆడింది. ఆ తరువాత 2023లో ఆసియా కప్ టోర్నమెంట్ లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లు హైబ్రిడ్ మోడల్ లో శ్రీలంక, దుబాయ్ వేదికల్లో జరిగాయి. ఇప్పుడు కూడా దుబాయ్ లో మ్యాచ్ లు నిర్వహించాలని చెప్పినా అందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించడం లేదు. దీంతో లాహోర్ లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ లాంచ్ కార్యక్రమం కూడా వాయిదా పడింది.
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫిబ్రవరి 2025లో ప్రారంభం కానుంది.