T20 world cup : T20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై టీమిండియా మర్చిపోలేని విజయం సాధించిన తర్వాత అనేక రూపాల్లో అక్కసు వెళ్లగక్కుతున్న దాయాది దేశ క్రికెట్ అభిమానులు… ఇప్పుడు ఇండియా గెలవాలని కోరుకుంటున్నారు. సౌతాఫ్రికాపైనే కాదు… ఆడే మిగతా 3 మ్యాచ్ ల్లోనూ రోహిత్ సేనే గెలవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకంటే… అప్పుడే పాక్ కు సెమీస్ ఛాన్స్ ఉంటుందని లెక్కలేస్తున్నారు.
సూపర్-12 గ్రూప్-2లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది… టీమిండియా. ఇదే గ్రూప్‌లో ఉన్న పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఐదోస్థానంలో ఉంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్ 2,3,4 స్థానాల్లో ఉండగా, నెదర్లాండ్స్ చివరి స్థానంలో ఉంది. పాక్ సెమీస్ చేరాలంటే సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌లతో జరిగే మ్యాచ్ ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అలాగే భారత్ కూడా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై గెలిచి… సౌతాఫ్రికా, జింబాబ్వే ఇకపై ఆడబోయే 3 మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్ మాత్రమే గెలిస్తే… పాక్ కు సెమీస్ ఛాన్స్ ఉందని లెక్కలేశారు… పాకిస్థాన్ ఫ్యాన్స్. ఈ సమీకరణాలే నిజమైతే… 10 పాయింట్లతో భారత్, 6 పాయింట్లతో పాకిస్తాన్ గ్రూప్-2 నుంచి సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
అంతేకాదు… తమ దురాశకు వరుణుడు కూడా సహకరించాలని ప్రార్థిస్తున్నారు… పాక్ ఫ్యాన్స్. ఎందుకంటే… వర్షం కారణంగా ఒక్క మ్యాచ్ రద్దైనా… పాకిస్థాన్ కు సెమీస్ దారులు మూసుకుపోతాయి. దాంతో… వాతావరణం సహకరించడంతో పాటు… ఎప్పుడూ లేనిది టీమిండియా అన్ని మ్యాచ్ ల్లోనూ గెలవాలని కోరుకుంటున్నారు… పాకిస్థాన్ ఫ్యాన్స్.