T20 Worls Cup 2024 – PNG Vs New Zealand Match Highlights: టీ 20 ప్రపంచకప్ లో మరో నామమాత్రపు మ్యాచ్ పపువా న్యూ గినీ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. వెస్టిండీస్ లోని బ్రయాన్ లారా క్రికెట్ అకాడమీలో జరిగిన మ్యాచ్ లో కివీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సి గ్రూప్ లో 3వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే చివరి మ్యాచ్ లో కివీస్ బౌలర్ లాకీ ఫెర్గ్యూసన్ అరుదైన రికార్డ్ అందుకున్నాడు. టీ 20 ప్రపంచకప్ లో బెస్ట్ ఎకానమీ బౌలర్ గా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తను 4 ఓవర్లు వేసి, ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీయడం విశేషం.
టీ 20 లో ఇంతవరకు ఎవరూ ఇలాంటి ఫీట్ సాధించలేదు. అయితే కెనడా బౌలర్ సాద్ బిన్ ఇలాంటి ప్రదర్శన చేశాడు కానీ, 2 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ నేపథ్యంలో ఫెర్గ్యూసన్ నెంబర్ వన్ ఎకానమీ బౌలర్ అయ్యాడు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగుకి వచ్చిన పపువా న్యూ గినీ 19.4 ఓవర్లలో 78 పరుగులకి ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదనలో కివీస్ 12.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి మ్యాచ్ ని ముగించింది.
79 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిన్ ఆలెన్ రెండో బంతికి డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ డేవన్ కాన్వే సాధికారికంగా ఆడాడు. కఠినమైన పిచ్ పై 3 సిక్స్ లు, 2 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
Also Read: 11మంది ఆట.. నన్ను ఆడమంటే సాధ్యమా: బాబర్
రచిన్ రవీంద్ర (6) ఎక్కువ సేపు నిలవలేదు. తర్వాత వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ (18), డేరీ మిచెల్ (19) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టుని గెలుపు తీరాలకు చేర్చారు. ఎట్టకేలకు 12.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేశారు. ఎప్పటిలాగే ప్రపంచకప్ టోర్నమెంటు తమకి కలిసిరాకపోవడంతో ఉత్త చేతులతోనే తిరుగు ప్రయాణం అవుతున్నారు.
పపువా న్యూ గినీ బౌలింగులో కబువా మోరియా 2, సెమో కామియా 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పపువా న్యూగిని.. 20 ఓవర్లు ఆడాలనే కృత నిశ్చయంతో ఆడినట్టుగా కనిపించింది. ఎందుకంటే న్యూజిలాండ్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కోవడం ఒక ప్రాక్టీస్ గా ఉంటుందని భావించి ఆడారు. అందుకే రన్స్ కన్నా వికెట్లు పడకుండా ఆడేందుకు ప్రయత్నించారు.
Also Read: SA vs USA T20 WC 2024 Match Preview: అమెరికా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య.. నేడే సూపర్ 8 తొలిమ్యాచ్
ఎంతలా ఆడినా ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఛార్లెస్ (17), సెసె బావు (12), నార్మన్ వనువా (14) చేశారు. మిగిలినవాళ్లందరూ సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు. ఒకరు డక్ అవుట్ అయ్యారు. ఇద్దరు ఒకొక్క రన్ మాత్రమే చేశారు. ఇలా మొత్తానికి 19.4 ఓవర్లలో 78 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
న్యూజిలాండ్ బౌలింగులో లాకీ ఫెర్గ్యూసన్ 3, ట్రెంట్ బౌల్ట్ 2, టిమ్ సౌథీ 2, ఇష్ సోధి 2, మిచెల్ సాంట్నర్ 1 వికెట్ పడగొట్టారు.