Neelam Upadhyaya : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తమ్ముడు సిద్ధార్థ చోప్రా (SIddharth Chopra)… హీరోయిన్ నీలం ఉపాధ్యాయ (Neelam Upadhyaya)ను పెళ్లడబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసలు ఈ నీలం ఉపాధ్యాయ ఎవరు? వీరిద్దరికీ ఎలా పరిచయం అయ్యింది? అనే విషయంపై ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు. నిజానికి నీలం తెలుగు హీరోయిన్. మరి ఈ హీరోయిన్ ఎవరు? తెలుగులో ఆమె చేసిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
సిద్ధార్థ్ చోప్రా తమ్ముడితో పరిచయం ఇలా…
హీరోయిన్ నీలం ఉపాధ్యాయ (Neelam Upadhyaya) ఒక డేటింగ్ యాప్ లో ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ చోప్రాకు పరిచయం అయ్యిందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రా వెల్లడించింది. ఇక ఈ బ్యూటీ ముంబైలోనే జన్మించింది. ఎంఎంకె కాలేజీలో చదువుకున్న ఈ అమ్మడు యాక్టింగ్, మోడలింగ్ మీద ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కోలీవుడ్లో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారగా, టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీని వరుస అవకాశాలు వరించాయి. కానీ ఆమెను అదృష్టం మాత్రం పలకరించలేదు. ఫలితంగా నీలం అనే ఒక హీరోయిన్ ఉందన్న విషయమే ఎవ్వరికీ గుర్తు లేదు.
నీలం మొదటి సినిమా ఇదే
నీలం ‘మిస్టర్ 7’ (Mister 7) అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఎస్విఆర్ మనవడు, జూనియర్ ఎస్వీ రంగారావు ఈ సినిమాలో హీరోగా నటించడం విశేషం. ఫస్ట్ మూవీనే బోల్తా కొట్టినప్పటికీ నీలంకి టాలీవుడ్ లో బాగానే అవకాశాలు వచ్చాయి. అల్లరి నరేష్ తో ఈ బ్యూటీ ‘యాక్షన్ త్రీడీ’ అనే సినిమాలో కూడా నటించింది. ముఖ్యంగా ఇందులో ‘స్వాతి ముత్యపు జల్లుల్లో’ అనే సాంగ్ రీమిక్స్ లో నీలం అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం తమిళంలోనూ ఈ బ్యూటీ రెండు సినిమాలు చేసింది. అలాగే నారా రోహిత్ తో కలిసి ‘పండగలా వచ్చాడు’ అనే సినిమాలో నటించింది. 2018 లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాతో పాటు ఆమె నటించిన మరో మూవీ కూడా రిలీజ్ కాలేదు.
2024 లోనే ఎంగేజ్మెంట్
ఇదిలా ఉండగా నీలం ఉపాధ్యాయ (Neelam Upadhyaya) హిందీలో ఒక్క సినిమా కూడా చేయకుండానే, అక్కడ పాపులర్ అయ్యింది. ఇటు సౌత్ లో స్టార్డం దక్కలేదు. అటు హిందీలో సినిమాలు చేయలేదు. అయినా ఆమె పాపులర్ కావడానికి గల కారణం ఏంటంటే.. నీలం స్వయానా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తమ్ముడికి కాబోయే భార్య. 2018 తర్వాత నీలం ఉపాధ్యాయ సినిమాలు చేయకపోయినప్పటికీ, 2024 ఆగస్టులో సిద్ధార్థ చోప్రాతో ఆమె నిశ్చితార్థం జరగగా, అప్పటి నుంచే అందరూ నీలం గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇక అంతకుముందు కూడా వీళ్ళిద్దరూ లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ ఎంగేజ్మెంట్ తర్వాత బయట ఎక్కువగా కలిసి కనిపించడం మొదలుపెట్టారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.