Danish Kaneria: పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానీష్ కనేరియా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. పాకిస్తాన్ లోని మైనారిటీల పరిస్థితి పై అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డానిష్ కనేరియా కూడా హాజరయ్యాడు. ఈ సమావేశంలో పాకిస్తాన్ లో తను ఎదుర్కొన్న వివక్ష గురించి, అక్కడ ఇతరులు తనతో ఏలా ప్రవర్తించారో సంచలన విషయాలను బయటపెట్టాడు.
పాకిస్తాన్ లో సమానగౌరవం లేకపోవడం, వివక్షత కారణంగా తన కెరీర్ నాశనమైందని అన్నాడు కనేరియా. అంతేకాకుండా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. డానిష్ కనేరియా మాట్లాడుతూ.. ” మనమంతా ఇక్కడ కలుసుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది. పాకిస్తాన్ లో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోవడం బాగుంది. అక్కడ చాలా వివక్షను ఎదుర్కొన్నాం. ఇప్పుడు మన గళం విప్పుతున్నాం. నేను కూడా పాకిస్తాన్ లో చాలాసార్లు వివక్షను అనుభవించాను. నా కెరియర్ నాశనమైంది.
నాకు తగినట్లుగా గౌరవం పొందలేకపోయాను. కారణం పాకిస్తాన్ లో మైనారిటీలం కావడమే. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. మనం పాకిస్తాన్ లో అనుభవించిన కష్టాలు ఎలాంటివో అమెరికాకి తెలియాలి. అప్పుడే ఏదో ఒక చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది వంటి అనేక మంది పాకిస్తాన్ ఆటగాళ్లు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు. వారు నాతో కలిసి భోజనం కూడా చేయలేదు.
అదే సమయంలో నా మతం మార్చుకోవాలని పదేపదే అడిగిన వ్యక్తి షాహిద్ అఫ్రీది. కానీ ఇంజమామ్ ఉల్హక్ ఎప్పుడూ నాతో ఇలా మాట్లాడేవారు కాదు. ఈ విషయంలో ఇంజమామ్ నాకు చాలా మద్దతు ఇచ్చారు. నన్ను బాగా చూసుకున్న ఏకైక కెప్టెన్ అతడే” అని తెలిపాడు డానిష్ కనేరియా. ఇతడు పాకిస్తాన్ తరపున మొత్తం 61 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. అనిల్ దల్పత్ తర్వాత పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రెండవ హిందూ క్రికెటర్ ఆయన.
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ కూడా కనేరియా. తన స్పిన్ బౌలింగ్ తో పాకిస్తాన్ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. కానీ అతడి కెరీర్ మాత్రం అనూహ్యంగా ముగిసింది. అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో క్రికెట్ కెరీర్ పూర్తిగా దెబ్బతింది. కానీ అతడు మాత్రం తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను అంగీకరించలేదు. వివక్ష, కుట్రల కారణంగా తన కెరీర్ ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే ఇప్పుడు డానిష్ కనేరియా చేసిన ఆరోపణలు కొత్తవేం కాదు. పాకిస్తాన్ క్రికెట్లో మైనారిటీలకు తగిన గౌరవం దక్కడం లేదని గతంలోనూ పలువురు విమర్శించారు. పాకిస్తాన్ జట్టులో ముస్లిం క్రీడాకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తారని, మైనారిటీలను పట్టించుకోరని పాకిస్తాన్ మాజీ పేసర్ సోయబ్ అక్తర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు దానేష్ కనేరియా కూడా మత వివక్ష కారణంగా తనని జట్టులో ప్రోత్సహించలేదని చెప్పుకొచ్చాడు.