Shubman Gill: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు 3 -1 తేడాతో ఓడిపోయిన తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్ లు లేని సమయంలో భారత ఆటగాళ్లు దేశవాళీలో ఆడడాన్ని తప్పనిసరి చేసింది బీసీసీఐ. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దాదాపు దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీలో పాల్గొన్నారు. అయితే ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో కెప్టెన్ గా గిల్ మంచి మార్కులు కొట్టేశాడు. గిల్ సారధ్యంలోని టీమిండియా ఈ సిరీస్ ని 2 – 2 తో సమం చేసింది.
Also Read: Asia Cup 2025: ఆసియా కప్ ఆడే బంగ్లాదేశ్ జట్టు ఇదే.. ఏకంగా 16 మంది సభ్యులతో
ఈ సిరీస్ లో గిల్ 75. 47 తో 754 పరుగులు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఇక ఇంగ్లాండ్ తో సిరీస్ అనంతరం.. భారత్ ఆడబోయే తదుపరి మ్యాచ్ లకి భారీగా గ్యాప్ వచ్చింది. దీంతో దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు గిల్ సిద్ధమయ్యాడు. స్వదేశంలో వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికాలతో టెస్ట్ సిరీస్ లను దృష్టిలో పెట్టుకున్న గిల్.. ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఇటీవల ఆసియా కప్ 2025 కి ఎంపిక చేసిన భారత జట్టులో గిల్ కి కూడా చోటు కల్పించింది బీసీసీఐ. ఈ టోర్నీకి ముందు ప్రతిష్టాత్మక దేశీయ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది.
అయితే ఈ పోటీలో టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్ కి నార్త్ జోన్ పగ్గాలు అప్పగించారు. అయితే ప్రస్తుతం ఈ టోర్నీలో గిల్ పాల్గొనడం లేదనే వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల గిల్ కి రక్త పరీక్ష నిర్వహించిన అతని ఫిజియో.. ఆ నివేదికను బీసీసీఐకి పంపాడు. అయితే త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో పాల్గొనవద్దని గిల్ కి అతడి ఫిజియో సలహా ఇచ్చాడు. ప్రస్తుతం గిల్ విహారయాత్రలో ఉన్నాడు. ఈ సందర్భంగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గిల్ షేర్ చేసిన ఈ ఫోటోలలో అతడు పడవలో కనిపించాడు. అయితే ఈ దులీప్ ట్రోఫీ ఆగస్టు 28 నుండి ప్రారంభం కాబోతోంది.
గిల్ కెప్టెన్సీ లోని నార్త్ జోన్ జట్టు బెంగళూరులోని బీసీసీ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ గ్రౌండ్ లో ఈస్ట్ జోన్ తో తలపడబోతోంది. ఆగస్టు 28 ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ మ్యాచ్ లో గిల్ పాల్గొనకపోతే.. వైస్ కెప్టెన్ అంకిత్ కుమార్ ఈ జట్టుకు నాయకత్వం వహించవచ్చు. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు సెప్టెంబర్ 9 నుండి దుబాయిలో ఆసియా కప్ 2025 టోర్నీ ప్రారంభం కాబోతోంది.
ఈ క్రమంలో ఆసియా కప్ లో గిల్ పాల్గొంటాడా..? లేదా..? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ టోర్నీ కోసం సెప్టెంబర్ 4 న భారత జట్టు దుబాయ్ కి బయలుదేరుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో గిల్ చికిత్స తీసుకుంటున్నాడని..? అతడు ఆసియా కప్ లో కూడా పాల్గొనేది అనుమానమే అన్న రూమర్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇక ఇప్పటికే గిల్ కి ఆసియా కప్ లో వైస్ కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఈ టోర్నీ కి గిల్ అందుబాటులో లేకపోతే.. వైస్ కెప్టెన్ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే అంశం కూడా ఆసక్తిగా మారింది.