Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి క్లౌడ్ బరస్ట్ విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో కుప్పలు కుప్పలుగా వచ్చిన మట్టిపెళ్లలు, రాళ్లు, వరదనీరు అక్కడి ఇళ్లను కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఓ బాలిక శిథిలాల కింద చిక్కుకుపోయి మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం.
చమోలీ జిల్లా తరాలి మార్కెట్ ప్రాంతం, తరాలి తాలూకా కార్యాలయం మొత్తం మట్టిపెళ్లల కింద కూరుకుపోయింది. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అధికార నివాసం సహా పలు ఇళ్లు, షాపులు, వాహనాలు పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి. సమీపంలోని సాగ్వారా గ్రామంలో ఒక చిన్నారి భవనంలో మట్టిపెళ్లల కింద ఇరుక్కుపోయినట్లు సమాచారం రావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చెప్‌డోన్ మార్కెట్ ప్రాంతంలోని కొన్ని దుకాణాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. తరాలి-గ్వాల్డాం రహదారి, తరాలి-సాగ్వారా రహదారి బురద, మట్టిపెళ్లల కారణంగా మూసివేయబడ్డాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ప్రజలు నీటిలో మట్టిపెళ్లలతో చిక్కుకుని తమ ఇళ్లలో నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Also Read: Gold Rate Dropped: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?
తరాలి తాలూకాలో మేఘ విస్ఫోటనం కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. భారీగా మట్టిపెళ్లలు రావడంతో అనేక ఇళ్లు, ముఖ్యంగా ఎస్డీఎం నివాసం పూర్తిగా దెబ్బతిన్నాయని చమోలీ జిల్లా కలెక్టర్ సందీప్ తివారీ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రి నుంచి నిరంతరం రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. అనేక మందిని ఇళ్ల నుంచి తరలించి సురక్షిత ప్రదేశాలకు చేర్చారు. నిన్న రాత్రి తరాలి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన భారీ వర్షాలతో జన జీవనం అతలాకుతలమైంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన పోలీసులు రాత్రి పూటనే ప్రజలను అప్రమత్తం చేసి, ఇళ్ల నుంచి బయటకు తీసి సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందిస్తూ, నిన్న అర్ధరాత్రి చమోలీ జిల్లా తరాలి ప్రాంతంలో మేఘ విస్ఫోటనం జరిగిన దురదృష్టకర సమాచారం వచ్చింది. జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నేను స్థానిక అధికారులతో నిరంతర సమాచారం తెలుసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. అందరూ సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను,” అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Devastating Cloud Burst at chepron Tharali in chamoli district Uttarakhand #cloudburst #Uttarakhand pic.twitter.com/qV0vxO5c3r
— Ankit Rawat 45 (@ankitrwtt045) August 23, 2025