WCL 2025 : వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీ ఫైనల్ లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. భారత్ ఛాంపియన్స్.. పాకిస్తాన్ జట్టుతో సెమీ ఫైనల్ ఆడేందుకు ఇస్టపడకపోవడంతో సెమీస్ ఆడకుండానే ఫైనల్ కి చేరింది పాకిస్తాన్ ఛాంపియన్స్. దీంతో సౌతాఫ్రికా చేతిలో చిత్తు చిత్తుగా ఓటమి పాలైంది. ఈ ఏడాది సౌతాఫ్రికా టీమ్ అటు వరల్డ్ టెస్ట్ ఛాంఫియన్స్ షిప్.. తాజాగా వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టైటిల్ ని గెలుచుకుంది. ఇక ఈ ఏడాది సెమీ ఫైనల్ లో సౌతాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాని ఓడించి ఫైనల్ కి చేరుకుంది.
WCL టైటిల్ సాధించిన సౌతాఫ్రికా
ఇక ఫైనల్ లో పాకిస్తాన్ ని మట్టి కరిపించింది. ఫైనల్ లో సౌతాఫ్రికా మాజీ ఆటగాళ్ల జట్టు WCL 2025 టైటిల్ గెలుచుకోవడం విశేషం. ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో కమ్రాన్ అక్మల్ 2 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ మహ్మద్ హఫీజ్ 17 పరుగులు చేశాడు. షార్టీల్ ఖాన్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేయగా.. షోయబ్ మాలిక్ 25 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఉమర్ అమీన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. ఆసిఫ్ అలీ 28 పరుగులు చేశాడు. 196 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే సునాయసంగా ఛేదించింది సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్టు. హషీమ్ ఆమ్లా 18 పరుగులు చేసి ఔట్ కాగా.. ఏబీ డివిలీయర్స్ 60 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 120 పరుగులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
41 ఏళ్ల వయస్సులో కూడా తగ్గేదేలే..
జాన్ పాల్ డుమినీ. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. వరుసగా 4, 6 బాది హాఫ్ సెంచరీతో మ్యాచ్ ని ముగించాడు. ఏదీ ఏమైనా ఈ మ్యాచ్ లో ఏబీ డివిలీయర్స్ ఫామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ బ్యాటింగ్ చూసి క్రికెట్ అభిమానులు ఆశ్యర్యపోతున్నారు. ఏబీ డివిలీయర్స్ 41 ఏళ్ల వయస్సులోనూ అద్భుతమైన షాట్లతో సత్తా చాటుతున్నారు. ఆయన త్వరగా రిటైర్డ్ అయ్యారని.. అతనిలో ఇంకా ఆట ఉందని పోస్టులు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆడి ఉంటే.. కచ్చితంగా టైటిల్ సాధించేదని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. కానీ పాకిస్తాన్ తో ఆడకూడదనే నిర్ణయంతోనే టీమిండియా ఈ మ్యాచ్ ఆడలేదు. టీమిండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడకపోయినా.. సెమీస్ కు చేరుకుంది. కానీ సెమీస్ లో మళ్లీ పాకిస్తాన్ తో తలపడాల్సి ఉండటంతో టీమిండియా తప్పుకుంది. ముందు ముందు కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తితే టీమిండియాకి చాలా నష్టం వాటిల్లుతుందని కొందరూ క్రీడాభిమానులు పేర్కొంటే.. మరికొందరూ నష్టం వాటిల్లినా ఉగ్రవాదులను పోషించేటటువంటి పాకిస్తాన్ లాంటి జట్లతో ఆడకపోవడమే మంచిది అని పేర్కొనడం విశేషం.

Share