Big Stories

SRH vs RCB IPL 2024 Highlights: సన్‌రైజర్స్‌కు బ్రేక్.. ఆర్సీబీ గెలిచిందోచ్‌..

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru IPL 2024 Highlights: ఐపీఎల్ చరిత్రలో హయ్యస్ట్ స్కోర్లు చేస్తూ దఢ దఢలాడించిన హైదరాబాద్ ఒక్కసారి చల్లబడింది. మొత్తానికి ఇన్నాళ్లూ గెలుపు కోసం ముఖం వాసిపోయేలా ఎదురుచూసినా ఆర్సీబీకి ఘనమైన గెలుపు లభించింది.

- Advertisement -

ఎదురులేని మొనగాడిలా మారిన హైదరాబాద్ ని  ఓడించి పరువు నిలబెట్టుకుంది. ఇక ఎన్ని గెలిచినా ప్లే ఆఫ్ ఆశలు దాదాపు శూన్యమైపోయిన దశలో కనీసం అట్టడుగు స్థానం నుంచైనా బయటపడాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ గెలుపు అని చెప్పాలి. అయినా సరే, పదో స్థానం నుంచి ఆర్సీబీ పైకి రాకపోవడం దురదృష్టమే అని చెప్పాలి.

- Advertisement -

టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బ్యాటింగ్ తీసుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అందుకు బదులుగా లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. 35 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

వివరాల్లోకి వెళితే… 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లూ అరివీర భయంకరంగా రెచ్చిపోతున్న ట్రావిస్ హెడ్ (1) త్వరగా అవుట్ అయిపోయాడు. దీంతో పవర్ ప్లేలో స్కోరు పెంచే బాధ్యతను అభిషేక్ శర్మ తీసుకున్నాడు. కొంతవరకు లాగించాడు.13 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

తర్వాత వచ్చిన మార్ క్రమ్ (7), నితీష్ కుమార్ (13), హెన్రిచ్ క్లాసెన్ (7), అబ్దుల్ సమద్ (10) , భువనేశ్వర్ కుమార్ (13) త్వరత్వరగా అయిపోయారు. అయితే షాబాజ్ అహ్మద్ ఒంటరి పోరాటం చేశాడు. 37 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మధ్యలో వచ్చిన కెప్టెన్ కమిన్స్ మాత్రం 15 బంతుల్లో 3 సిక్సులు, 1 ఫోర్ సాయంతో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Also Read: జింబాబ్వే మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు కుక్క

ఇలా అందరూ ఏదో అర్జంటు పని ఉందన్నట్టు పెవిలియన్ బాట పట్టడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. మొత్తానికి విజయానికి 35 పరుగుల దూరంలో ఆగిపోయింది.

ఆర్సీబీ బౌలింగులో విల్ జాక్స్ 1, స్వప్నిల్ సింగ్ 2, కర్ణ్ శర్మ 2, కెమెరాన్ గ్రీన్ 2, యశ్ దయాల్ 1 వికెట్లు పడగొట్టారు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఓపెనర్లు సాధికారికంగా ఆడారు. కొహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ డుప్లెసిస్ 12 బంతుల్లో 25 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన విల్ జాక్స్ (6) నిరాశ పరిచాడు. కానీ రజత్ పటీదార్ మాత్రం విజృంభించాడు. కేవలం 20 బంతుల్లో 5 సిక్స్ లు, 2 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

కెమరాన్ గ్రీన్ 20 బంతుల్లో 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మహిపాల్ (7), దినేష్ కార్తీక్ (11) స్వప్నిల్ (12) త్వరగా అవుట్ అయిపోయారు. మొత్తానికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

హైదరాబాద్ బౌలింగులో కమిన్స్ 1, నటరాజన్ 2, జయదేవ్ ఉనద్కత్ 3, మయాంక్ మార్కండే 1 వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News