Suryakumar Yadav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా శుక్రవారం రోజు లక్నో సూపర్ జెయింట్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఎన్నో ఎమోషనల్ మూమెంట్స్ కనిపించాయి. చివరి వరకు ఇరుజట్ల మధ్య దోబూచులాడిన విజయం.. చివరికి లక్నోని వరించింది. ముంబై బ్యాటింగ్ సమయంలో మిడిల్ ఆర్డర్ లో క్రీజ్ లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ విజయానికి స్వల్ప దూరంలో తన వికెట్ ని కోల్పోయాడు.
Also Read: Tilak Varma: తిలక్ వర్మ వివాదం… రిటైర్డ్ హర్ట్.. రిటైర్డ్ ఔట్ తేడాలివే?
ఆ తర్వాత మ్యాచ్ ని గెలిపిస్తాడు అనుకున్న తిలక్ వర్మ రిటైర్డ్ హార్ట్ గా అవుట్ కావడంతో సూర్య కుమార్ యాదవ్ షాక్ కి గురయ్యాడు. అసలు ఏం జరుగుతుందో తెలియక అయోమయస్థితిలో ఉన్నాడు. తిలక్ వర్మని రిటైర్డ్ హార్ట్ గా ప్రకటించిన అనంతరం సూర్య కుమార్ యాదవ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. సూర్య తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. అతడికి నచ్చచెప్పేందుకు కోచ్ జయవర్ధనే ప్రయత్నం చేశాడు.
అయినప్పటికీ తిలక్ వర్మ రిటైర్డ్ హార్ట్ అవుట్ పై సూర్య సంతోషంగా లేనట్టుగా కనిపించింది. దీంతో సూర్యకుమార్ యాదవ్ రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ముంబై జట్టు ట్రోలింగ్ కి గురవుతుంది. ముంబై జట్టు తీసుకున్న నిర్ణయం అట్టర్ ప్లాప్ కావడంతో ఫ్యాన్స్, సీనియర్స్, మాజీ ఆటగాళ్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఫామ్ లో ఉన్న బ్యాటర్ ని వెనక్కు పంపాల్సిన అవసరం ఏముందని సునీల్ గవాస్కర్, హర్భజన్ సింగ్ లాంటి మాజీ ఆటగాళ్లు పెదవి విరిచారు.
ఇంపాక్ట్ ప్లేయర్ గా వెళ్లిన తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అయితే తిలక్ ని రిటైర్డ్ హార్ట్ గా ప్రకటించడంపై ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా వివరణ ఇచ్చాడు. కానీ ఈ నిర్ణయం సూర్య కుమార్ యాదవ్ కి నచ్చలేదని అతడి రియాక్షన్ బట్టి తెలుస్తోంది. తిలక్ వర్మ ఎపిసోడ్ పై ముంబై కోచ్ జయవర్ధనే స్పందిస్తూ.. ” తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య కుమార్ యాదవ్ తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించాడు. కానీ చివర్లో అతడు దూకుడు పెంచాలని చూసినా కుదరలేదు.
దీంతో అతడిని అక్కడికే ఆపి.. కొత్తగా ఎవరినైనా పంపించాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇబ్బంది పడుతున్న సమయంలో ఇంకా అతడిపై ఒత్తిడి పెంచకూడదు. క్రికెట్ లో ఇవన్నీ సహజంగానే జరుగుతాయి. తిలక్ ని అవుట్ గా ప్రకటించడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ జట్టు వ్యూహంలో భాగంగా అలా చేయాల్సి వచ్చింది. ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్ బాగుంది. కానీ పవర్ ప్లే లో అదనంగా పరుగులు ఇచ్చాము. బంతిని వేగంగా వేసేందుకు ప్రయత్నించడం వల్లే అలా జరిగింది. హార్దిక్ పాండ్యా తన అనుభవంతో బౌలింగ్ చేశాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఫలితం రాబట్టాడు.” అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు.