Maoists surrender: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. నెల రోజుల నుంచి మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతూనే ఉన్నారు. గడిచిన నెలలో 64 మంది మావోయిస్టులు లొంగిపోగా.. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 86 మంది పోలీసులకు లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది.
కాసేపటి క్రితమే 86 మంది మావోయిస్టులు మల్టీజోన్-1 ఐజీ పీ.చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో లొంగిపోయారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ తెలిపారు. దేశంలో ఈ ఏడాది చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో 300 మందికిపైగా మావోయిస్టులు మరణించారని ఆయన చెప్పారు. మావోయిస్టుల సిద్ధాంతాలను వదిలి జనాల్లో కలవాలనే పిలుపునకు తోడు.. అలాగే మావోయిస్టు అగ్ర నాయకుల నానా ఇబ్బందులకు తట్టుకోలేక.. వీళ్లందరూ లొంగిపోయినట్లు ఐజీ పి.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం నుంచి 4, పార్టీ నుంచి 4, మిగతా వారు రకరకాల సంఘాల మిలీషియా సభ్యులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాకు చెందిన వారు 81 మంది కాగా ములుగు జిల్లాకు చెందిన వారు అయిదుగురు వ్యక్తులు ఉన్నట్లు ఐజీ పీ. చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
ALSO READ: HE TEAMS : ఆడవాళ్ల నుంచి మగవాళ్లను కాపాడండి… రోడ్డెక్కి పోరాడుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్
లొంగిపోయిన వారిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమంలో భాగంగా ఈ 86 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఐజీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద డబ్బులు కూడా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
లొంగిపోయిన వారిలో ఏసీఎం సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. లక్ష, మిగతా సభ్యులకు రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పునరావాసంతో పాటు అన్ని ప్రోత్సాహకాలు కూడా అందేలా చూస్తామని వెల్లడించారు. మావోయిస్టుల లొంగుబాటులో కీలక పాత్ర పోషించిన కొత్తగూడెం, సీఆర్‌ఫీఎఫ్ పోలీసుల చొరవ అమోఘమని మల్టీజోన్-1 ఐజీ పీ. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ALSO READ: AAI Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో 309 ఉద్యోగాలు.. రూ.1,40,000 జీతం..