Suryakumar Yadav: భారత టి-20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ {Suryakumar Yadav} కి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తయింది. గత కొంతకాలంగా సూర్య కుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడికి కుడి వైపు పొత్తికడుపు కింది భాగంలో వైద్యులు సర్జరీ నిర్వహించారు. జర్మనీలో సూర్య కుమార్ కి స్పోర్ట్స్ హెర్నియాకు సంబంధించిన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు డాక్టర్లు.
Also Read: Rishabh pant: రిషబ్ పంత్ కు టైట్ హగ్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్?
ఈ విషయాన్ని సూర్య కుమార్ యాదవ్ సోషల్ మీడియాలో ఆపరేషన్ తర్వాత ఓ ఫోటోని షేర్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు. తనకి శస్త్ర చికిత్స సజావుగా జరిగిందని.. తాను ప్రస్తుతం కోలుకుంటున్నానని తెలిపాడు సూర్య. ” నాకు స్పోర్ట్స్ హెర్నియాకి సంబంధించి కుడి వైపు పొత్తికడుపు కింది భాగంలో శస్త్ర చికిత్స పూర్తయింది. సర్జరీ సాఫీగా పూర్తయినందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. మళ్లీ మైదానంలోకి తిరిగి రావడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను” అని తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
దీంతో సూర్య అభిమానులు అతడు త్వరగా కోలుకొని తిరిగి జట్టులోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. 34 ఏళ్ల సూర్య కుమార్ యాదవ్ భారత క్రికెట్ జట్టుకు టి-20 కెప్టెన్ గా సేవలు అందిస్తున్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బీసీసీఐ సూర్యకుమార్ కి టి-20 సారథ్య బాధ్యతలు అప్పగించింది. సూర్య టి-20 ఫార్మాట్ లో దూకుడైన బ్యాటింగ్ తో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇక ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది.
5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి టెస్ట్ పూర్తయింది. ఈ సిరీస్ తరువాత టీమిండియా ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత టి-20 సిరీస్ ఆడబోతోంది. మొదటి టీ-20 ఆగస్ట్ 26న, చివరి మ్యాచ్ ఆగస్ట్ 31న షెడ్యూల్ చేశారు. అయితే సర్జరీ నేపథ్యంలో ఈ పర్యటనకు సూర్య కుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశం ఉంది. ఈ ముంబై ఆటగాడు స్పోర్ట్స్ హెర్నియా బారిన పడడం ఇది రెండవసారి.
గతేడాది జనవరిలో ఎడమవైపున నొప్పి రావడంతో జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే స్వదేశంలో ఆఫ్గనిస్తాన్ తో జరిగిన టి-20 సిరీస్ కి దూరమయ్యాడు. ఆ తరువాత ఫిట్నెస్ సాధించి ఐపీఎల్ తో పాటు టి-20 ప్రపంచ కప్ 2024 లో భాగమయ్యాడు. ఇప్పుడు మరోసారి కుడివైపు నొప్పి రావడంతో మళ్లీ చికిత్స చేయించుకున్నాడు. ఈ కారణంగా అతడు దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు.
ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్ గా సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ వ్యవహరించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 లో అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన అయ్యర్.. తిరిగి టి-20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బంగ్లాదేశ్ తో వన్డే, టి-20 సిరీస్ ల అనంతరం.. టి-20 లో తరువాత మేజర్ ఈవెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోతోంది. భారత్, శ్రీలంక లో హైబ్రిడ్ మోడల్ లో ఐసీసీ టి-20 ప్రపంచ కప్ 2026 ని ఫిబ్రవరి, మార్చ్ లో నిర్వహించబోతోంది. ఇందులో మొత్తం 20 జట్లు పోటీ పడతాయి. ఈ ప్రపంచకప్ లో టీం ఇండియాకి కెప్టెన్ గా సూర్య సూర్య కుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు.