
IPL: క్రికెట్ మ్యాచ్‌లతో భారీగా సొమ్ము సంపాదిస్తున్న బీసీసీఐ.. అప్పుడప్పుడూ కాస్త సోషల్ సర్వీస్‌లోనూ భాగస్వామ్యం అవుతుంటుంది. సీఎస్‌ఆర్ ఫండ్స్‌గా చూపించుకుని.. పన్ను సేవ్ చేసుకునేందుకో ఏమో కానీ.. కొన్ని పర్యావరణ హితమైన పనులు చేపడుతోంది. తాజా ఐపీఎల్‌లో అలాంటిదే ఓ కార్యక్రమం చేపట్టింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా.. ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌లో నమోదైన ఒక్కో డాట్ బాల్కి 500 చెట్లు నాటుతామని గతంలోనే ప్రకటించింది బీసీసీఐ. ఇప్పుడు ఐపీఎల్ ముగియడంతో ప్లేఆఫ్స్‌లో పడిన డాట్ బాల్స్ ఎన్ని? బీసీసీఐ నాటబోతున్న మొక్కలెన్ని? అంటూ లెక్కలేస్తున్నారు నెటిజన్స్.
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1లో 84 డాట్ బాల్స్ పడ్డాయి. ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లో 96 డాట్ బాల్స్ వేశారు. గుజరాత్, ముంబై క్వాలిఫయర్-2లో 67 డాట్ బాల్స్ నమోదయ్యాయి. ఇక, చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వర్షం కారణంగా కొన్ని ఓవర్లు కుదించడంతో కేవలం 45 డాట్ బాల్స్ మాత్రమే పడ్డాయి. ఇలా 4 ప్లేఆఫ్స్ మ్యాచుల్లో మొత్తంగా 292 డాట్ బాల్స్ పడ్డాయి. ఇక ఈ డాట్ బాల్స్ ఎక్కువగా వేసింది ఆకాశ్ మధ్వాల్, మహ్మద్ షమి, రషీద్‌ఖాన్, మతీశా పతిరనలే. వీళ్లంతా పర్యావరణ పరిరక్షణలో పరోక్షంగా భాగస్వాములు కాబోతున్నారన్న మాట.
ఇక, బీసీసీఐ చెప్పినట్టు.. ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటాలంటే.. మొత్తం 292 డాట్ బాల్స్‌కి 1,46,000 మొక్కటు నాటాల్సి ఉంటుంది. ఆ మేరకు సుమారు లక్షన్నర మొక్కలు నాటేందుకు సిద్ధమవుతోంది బీసీసీఐ.