Varun Chakravarthy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత ఆటగాళ్లకు ఓ చిరస్మరణీయమైన టోర్నమెంట్. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ ని గెలుచుకుంది. ఈ ట్రోఫీలో అద్భుతంగా రాణించి అందరి ప్రశంసలు అందుకున్నాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఈ టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్ గా నిలిచాడు. కేవలం మూడు మ్యాచ్లలో 9 వికెట్లు పడగొట్టాడు.
Also Read: IPL 2025: CSK ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్…ఇక ఫ్రీ బస్!
అయితే టి-20 వరల్డ్ కప్ 2021 లో మాత్రం నిరాశపరిచాడు వరుణ్ చక్రవర్తి. ఈ నేపథ్యంలో తాజాగా 2021 టి-20 వరల్డ్ కప్ తర్వాత తనకి ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ప్రపంచ కప్ లో తన పేలవమైన ప్రదర్శన కారణంగా తనకు ఫోన్ లో బెదిరింపులు వచ్చేవని గుర్తు చేసుకున్నాడు. తనను భారతదేశానికి తిరిగి రావద్దని హెచ్చరించారని, తన ఇంటి వరకు వెంబడించారని చెప్పుకొచ్చాడు. 2021 t20 ప్రపంచ కప్ లో పేలవమైన ప్రదర్శన తర్వాత వరుణ్ చక్రవర్తిని జాతీయ జట్టు నుండి తొలగించారు.
ఆ సమయంలో దాదాపు వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిందని అంతా భావించారు. వరల్డ్ కప్ లో చక్రవర్తి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పాకిస్తాన్ చేతిలో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ ముగిసిన తర్వాత తీవ్ర మనోవేదనను అనుభవించానని వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు. ” 2021 టీ-20 వరల్డ్ కప్ టోర్నమెంట్ నా జీవితంలో అత్యంత మనోవేదన అనుభవించిన టోర్నీ.
ఆ సమయంలో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఆ లీగ్ లో నేను కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాను. ఆ తర్వాత మూడు సంవత్సరాలు జట్టులోకి నన్ను తీసుకోలేదు. ఇప్పుడు జట్టులోకి తిరిగి రావడం.. నా అరంగేట్రం కంటే కఠినంగా అనిపించింది. అయితే 2021 వరల్డ్ కప్ తర్వాత నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
నేను భారతదేశానికి రాకూడదని, ఒకవేళ వస్తే సజీవంగా ఉండలేవని హెచ్చరించారు. కొంతమంది ఏకంగా నా ఇంటి దగ్గరికి వచ్చారు. నేను ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వస్తున్నప్పుడు కొందరు బైకులపై వెంబడించారు. అభిమానులు భాగోద్వేగంగా ఉంటారని నాకు తెలుసు. కానీ అలాంటి పరిస్థితిలను ఎదుర్కోవడం కష్టం. ఆ వరల్డ్ కప్ తర్వాత నన్ను నేను చాలా మార్చుకున్నాను.
Also Read: KKR Performs Pooja: మళ్లీ కప్ గెలవాలని.. KKR పూజలు.. వికెట్లకే దండేసి దండం పెట్టారు !
అంతకుముందు ఒక సెషన్ లో 50 బంతులు ప్రాక్టీస్ చేసేవాడిని. అలాంటిది ఆ తర్వాత దానిని రెట్టింపు చేశాను. సెలెక్టర్లు నన్ను పిలుస్తారో లేదో తెలియకుండానే కఠినంగా శ్రమించాను. అలా మూడవ సంవత్సరం తర్వాత అంతా మారిపోయినట్లు నాకు అనిపించింది. ఆ తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐపీఎల్ 2024 ట్రోఫీని మా కేకేఆర్ జట్టు గెలిచిన తర్వాత నాకు జాతీయ జట్టులో అవకాశం దొరికింది”. అని చెప్పుకొచ్చాడు వరుణ్ చక్రవర్తి.