Hyderabad Haleem Prices: రంజాన్ మాసం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా హలీం ఘుమఘుమలు ఆహా అనిపిస్తాయి. గల్లీ నుంచి మొదలు కొని పేరు మోసిన రెస్టారెంట్ల వరకు హలీం అమ్మకాలు జోరుగా కొనసాగిస్తాయి. హలీం పేరుకు ముస్లీం సంప్రదాయ వంటకం అయినప్పటికీ, హిందువులు, ముస్లీంలు, క్రిస్టియన్లు అనే తారతమ్యం లేకుండా అందరూ లొట్టేలేసుకుంటూ తినేస్తారు. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ వ్యాప్తంగా ఎలా పాపులర్ అయ్యిందో, అలాగే హైదరాబాద్ హలీం టేస్టీ ఖండాంతరాలకు విస్తరించింది. రంజాన్ సందర్భంగా ఇక్కడి నుంచి ఇతర దేశాలకు హలీం ఎగుమతి అవుతుంది. ప్రతి సంవత్సరం హలీంతో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది.
గతంతో పోల్చితే పెరిగిన హలీం ధరలు
గత ఏడాదితో పోల్చితే ఈ సారి హలీం ధరలు బాగా పెరిగాయి. చిన్న రెస్టారెంట్ల నుంచి పేరు మోసిన రెస్టారెంట్ల వరకు ధరలను పెంచాయి. కొన్ని రెస్టారెంట్లలో హలీం ధర రూ. 280గా ఉంటే.. మరికొన్ని రెస్టారెంట్లలో రూ. 340గా ఉంది. ఒక్కో రెస్టారెంట్ లో ధర ఒక్కోలా ఉంది. ముడిపదార్థాల ధరలు పెరగడం.. ముఖ్యంగా మటన్, మసాలా దినుసుల రేట్లు గతంతో పోల్చితే ఈసారి మరింత పెరిగినట్లు రెస్టారెంట్ల యజమానులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే హలీం రేట్లు పెంచినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదికి మసాలా దినుసుల రేట్లు 25 శాతం వరకు పెరిగాయంటున్నారు. మటన్ రేట్లు కూడా గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ కావడంతోనే హలీం రేట్లు పెంచక తప్పలేదంటున్నారు రెస్టారెంట్ యజమానులు.
ఆన్ లైన్ తో పోల్చితే ఆఫ్ లైన్ లోనే ఎక్కువ డిమాండ్
ఇక రంజాన్ మాసంలో హలీంకు ఓ రేంజ్ లో డిమాండ్ ఉంటుంది. అన్ని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్.. ముఖ్యంగా జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్ లో పెద్ద మొత్తంలో ఆర్డర్లు లభిస్తున్నాయి. అయినప్పటికీ హలీంకు ఆఫ్ లైన్ లోనే భారీగా డిమాండ్ ఉంటుంది. సాయంత్రం అయితే చాలు, రెస్టారెంట్ల ముందు హలీం ప్రియులు క్యూలు కడుతున్నారు. ఈ ఏడాది బర్డ్ ఫ్లూ భయం నేపథ్యంలో చాలా వరకు చికెన్ హరీస్ అమ్మకాలు తగ్గిపోయాయి. మటన్ హలీం తినేందుకే జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
Read Also: నోరూరించే హలీం కావాలా? హైదరాబాద్ లో బెస్ట్ రెస్టారెంట్లు ఇవే!
హలీంకు కేరాఫ్ హైదరాబాద్ పాత బస్తీ
రంజాన్ హలీం తయారీ, విక్రయాల్లో హైదరాబాద్ పాత బస్తీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉండే ప్రజలు రంజాన్ మాసంలో పాత బస్తీకి వచ్చి మరీ హలీం తిని వెళ్తారు. ముఖ్యంగా పిస్తా హౌజ్, షాదాబ్ హోటల్, నయాగ్రా హోటల్, శాలిబండలోని షాగౌస్, బార్కాస్ సహా పలు రెస్టారెంట్లలో హలీం విక్రయాలు పెద్దమొత్తంలో కొనసాగుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది హలీం బిజినెస్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా.
Read Also: ‘కోఠి’ పేరు వెనుక ఇంత కథ ఉందా? ఆ ప్యాలెస్ ను ఎవరు, ఎవరి కోసం కట్టించారంటే?