Virat – Anushka: క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్ట్ లు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ లో విజయం సాధించగా.. రెండవ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఇక మూడవ టెస్ట్ ఫలితం కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి.. భవిష్యత్తులో కేవలం వన్డే మ్యాచ్ లలో మాత్రమే ఆడతానని తెలిపిన విషయం తెలిసిందే.
Also Read: Case on Yash Dayal: పీకల్లోతు కష్టాల్లో RCB బౌలర్ దయాల్…ఏ క్షణమైనా అరెస్ట్..?
ఈ క్రమంలో విరాట్ – అనుష్క జంట క్రికెట్ మైదానంలో కాకుండా వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ కు హాజరై సందడి చేశారు. తన భార్య అనుష్క శర్మతో కలసి విరాట్ కోహ్లీ నోవాక్ జొకోవిచ్ ఆడిన మ్యాచ్ ని వీక్షించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ సూట్, బూట్ లో కనిపించి తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి మ్యాచ్ ను ఆస్వాదిస్తూ కనిపించారు.
ఈ క్రమంలో జోకోవిచ్ కి మద్దతుగా రాయల్ బాక్స్ లో కూర్చున్న విరుష్క దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వింబుల్డన్ 2025 లో భాగంగా జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో నోవాక్ జోకోవిచ్.. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ డి మినార్ తో తలపడ్డాడు. ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. జోకోవిచ్ మొదటి సెట్ ను 1- 6 తో కోల్పోయినప్పటికీ.. ఆ తరువాత అద్భుతంగా పుంజుకొని తదుపరి మూడు సెట్లను 6 – 4, 6 – 4, 6 – 4 తో క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాడు.
ఈ అద్భుతమైన విజయాన్ని విరాట్ – అనుష్క జంట ఎంతో ఉత్సాహంగా వీక్షించారు. ఈ క్రమంలో విరుష్క వారి స్టైలిష్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. విరాట్ కోహ్లీ టాన్ బ్రౌన్ బ్లేజర్, వైట్ షర్ట్, గ్రే టై తో డ్యాపర్ గా కనిపించాడు. ఇక అనుష్క శర్మ వైట్ బ్లేజర్ తో, సింపుల్ మేకప్ తో ఎలిగెంట్ గా మెరిసింది. ఈ జంట వింబుల్డన్ వాతావరణానికి తగ్గట్లుగా సాంప్రదాయ దుస్తులలో వచ్చి అందరి ప్రశంసలు పొందారు. ఇక ఈ మ్యాచ్ అనంతరం వింబుల్డన్ లో నోవాక్ జోకోవిచ్ సాధించిన విజయం పై విరాట్ కోహ్లీ స్పందించాడు.
Also Read: HBD Dhoni: ధోని క్రేజ్.. తెలుగు రాష్ట్రాల్లో 12 కటౌట్స్.. ఒక్కొక్కటి 50 అడుగులకు పైగానే
ఆయన తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో జోకోవిచ్ ను ప్రశంసిస్తూ.. ” ఇది ఎంతో అద్భుతమైన మ్యాచ్. గ్లాడియేటర్ కు ఎప్పటిలాగే ఇది సులభమైన పని ” అని రాసుకోచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ మద్దతుకు నోవాక్ జకోవిచ్ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వ్యాఖ్యలు జోకావిచ్ తో విరాట్ కోహ్లీకి ఉన్న స్నేహ బంధాన్ని, అతడి ఆటపట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తున్నాయి. అయితే విరుష్క దంపతులు వింబుల్డన్ కి రావడం ఇది మొదటిసారి కాదు. పదేళ్ల క్రితం 2015 లో కూడా ఈ జంట ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ని వీక్షించారు. దీంతో అప్పటి, ప్రస్తుత ఫోటోలను పోలుస్తూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.