Stampede Virat Kohli| రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ 2025 విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించడం, 47 మంది గాయపడడంతో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై తాను మాటల్లో చెప్పలేని బాధలో ఉన్నానని, హృదయం బరువెక్కిందని కోహ్లీ అన్నారు. సోషల్ మీడియాలో ఆర్‌సీబీ అధికారిక ప్రకటనను షేర్ చేస్తూ వ్యక్తగతంగా తన బాధను కూడా పంచుకున్నారు.
బుధవారం, జూన్ 4న జరిగిన ఆర్సీబీ ఐపిఎల్ విజయోత్సవ వేడుకలకు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. స్టేడియం సామర్థ్యం 35,000 మాత్రమే అయినప్పటికీ, రెండు లక్షలకు పైగా అభిమానులు ఆర్‌సీబీ జట్టును చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలో స్టేడియం బయట తొక్కిసలాట జరిగింది. దీంతో కేవలం 20 నిమిషాల్లోనే వేడుకలు ముగిశాయి. ఆర్‌సీబీ జట్టు సభ్యులు, కోచ్ ఆండీ ఫ్లవర్, మెంటర్ దినేష్ కార్తీక్‌తో సహా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.
స్టేడియం బయట జరిగిన దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే.. ఆర్‌సీబీ జట్టు కార్యక్రమాన్ని సవరించి, స్థానిక అధికారుల సూచనలను పాటించింది. ఈ దుర్ఘటనకు కారణం స్టేడియం సమీపంలోని డ్రైన్‌పై ఉన్న తాత్కాలిక స్లాబ్ కూలిపోవడమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనివల్ల భయాందోళనలు చెలరేగి తొక్కిసలాట జరిగింది. పాస్‌లతో మాత్రమే ప్రవేశం అని నిర్ణయించినప్పటికీ, ఆర్‌సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలవడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) ఈ ఘటనపై విమర్శలు ఎదుర్కొంటోంది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ కార్యక్రమ బాధ్యత బీసీసీఐది కాదని, అయితే నిర్వహణలో లోపాలు ఉన్నాయని అంగీకరించారు.
అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ విజయాన్ని బుధవారం ఘనంగా జరుపుకుంది. విరాట్ కోహ్లీ కప్పు చేతబట్టుకొని ఉత్సాహంగా కనిపించాడు. ఆర్సీబీ అభిమానుల అరుపులతో స్టేడియం దద్దరిల్లింది.
కోహ్లీ స్టేడియంలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మా కెప్టెన్ రజత్ పటీదార్ చెప్పినట్లు, ఇకపై ‘ఈ సాలా కప్ నమ్దే’ కాదు, ‘ఈ సాలా కప్ నమ్దు’!” (ఈ సారి కప్పు నాదే కాదు.. ఈ సారి కప్ మాది) అని అన్నారు. “ఈ విజయం కేవలం ఆటగాళ్ల కోసం కాదు, 18 ఏళ్లుగా ఆర్‌సీబీని ఆదరించిన అభిమానులకు ఈ ట్రోఫీ అంకితం చేస్తున్నాను. ప్రపంచంలో ఇలాంటి అభిమానులు ఎక్కడా కనిపించరు. మీరు, బెంగళూరు ప్రజలు, ఆర్‌సీబీని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఇలాంటి అభిమానులు ఏ జట్టుకూ లేరు” అని ఆయన భావోద్వేగంతో అన్నారు. ఆ తరువాత కెప్టెన్ పటీదార్‌ను మాట్లాడమన్నారు.
పటీదార్ మాట్లాడుతూ.. “నమస్కార బెంగళూరు! మీరంతా ఈ ట్రోఫీకి అర్హులు. మేము మిమ్మల్ని ప్రేమిస్తాం,” అన్నారు.
Also Read: ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడలేను.. ఐపిఎల్ రిటైర్మెంట్‌పై స్పందించిన కొహ్లీ
అంతకుముందు, ఆర్‌సీబీ జట్టు అహ్మదాబాద్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో బెంగళూరు చేరింది. ఆ తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను విధానసౌధలో జట్టు సభ్యులు కలిశారు. ఆ తర్వాత, ఆటగాళ్లను మైసూరు తలపాగ పేట, దండలతో సన్మానించారు. వర్షం కారణంగా ఓపెన్ టాప్ బస్సు పరేడ్ రద్దయింది. జట్టు బస్సులో స్టేడియానికి చేరగా, అభిమానులు జెండాలతో, కేకలతో వెంబడించారు.