Rohit Sharma Comments on His Retirement: మేం చిన్నప్పటి నుంచి వన్డే క్రికెట్ చూసి పెరిగాం. అదే ఆడి పెరిగాం. అందువల్ల వన్డేలు ఆడటమంటే మాకెంతో ఇష్టమని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇప్పట్లో రిటైర్ మెంట్ తీసుకోనని, తన ఆటతీరు ఇప్పటికి మెరుగ్గా ఉందని, బ్యాట్ టచ్ తగ్గలేదని అన్నాడు. బాగా ఆడుతున్నప్పుడు ఎందుకు రిటైర్ కావాలని ప్రశ్నించాడు.
ఇంకా రెండు మూడేళ్లు ఆడే సత్తా తనలో ఉందని మీడియాతో మాట్లాడుతూ రోహిత్ అన్నాడు. 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ గెలవాలి, అలాగే 2027 వన్డే వరల్డ్ కప్ కూడా ఆడాలని ఉందని పేర్కొన్నాడు. అసలైన కప్ అంటే, నా దృష్టిలో వన్డే ప్రపంచ కప్ ఒక్కటేనని తెలిపాడు. అందుకనే మొన్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని అన్నాడు.
ఆరోజు ఫైనల్ మ్యాచ్ లో కూడా మన కుర్రాళ్లు బాగానే ఆడారు. కాకపోతే మన మీద ఆరోజు ఆస్ట్రేలియన్లు బాగా ఆడారంతేనని అన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచీ, చెడులనేవి ఉంటాయి. ఆరోజు బ్యాడ్ మనవైపు నిలిచిందని తెలిపాడు. ప్రస్తుతం తన ఆటతీరు బాగుందని, ఇలానే ఆడుతూ మరికొన్నాళ్లపాటు క్రికెట్ లో కొనసాగాలనుకుంటున్నానని తన మనసులో కోరిక బయటపెట్టాడు.
Also Read: మా ఓటమికి ముగ్గురు కారణం: కేఎల్ రాహుల్
ఇంతకుముందు కూడా ఇదే మాట చెప్పాడు. ఏరోజైతే ఉదయం లేచిన తర్వాత నేనింక క్రికెట్ ఆడను, నాకు బోరు కొడుతుందని అనిపిస్తుందో ఆ రోజే గుడ్ బై చెప్పేస్తానని అన్నాడు. ఇందులో మరోమాటకు తావులేదని, అదే మాటపై ఇప్పటికి నిలబడ్డానని అన్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు క్రికెట్ ప్రపంచంలోనే గడుపుతుంటానని తెలిపాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ ను రోహిత్ సారథ్యంలో టీమిండియా 4-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు సౌతాఫ్రికా పర్యటనలో కూడా 2 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను సమం చేసింది.