1 year for Congress Govt: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. సాధించిన విజయాలు కాసేపు పక్కన బెడితే.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాల మాటేంటి? ఏయే విషయాలు వెలుగులోకి వచ్చాయి? విచారణ జరుగుతున్న అంశాలేంటి? కొత్తగా చేయాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? వీటి గుట్టు తేలితే నేతలు జైలుకి వెళ్లడం ఖాయమా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై ఫోకస్ చేసింది. తొలుత కాలేశ్వరం-మేడిగడ్డ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. దీనిపై పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. కింది స్థాయి అధికారులు, నిర్మాణ సంస్థ, ఇంజనీర్లను నుంచి కీలక సమాచారం తీసుకున్న కమిషన్, రేపో మాపో అప్పటి ప్రభుత్వ పెద్దలైన నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. వారిని విచారిస్తే మేడిగడ్డ వ్యవహారం కొలిక్కి రావచ్చని భావిస్తోంది. వచ్చే ఏడాదిలో దీనికి పుల్‌స్టాప్ పడనుంది.
ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల అంశంపై దర్యాప్తు తొలుత స్పీడ్‌గా సాగినా ఆ తర్వాత మందగించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి నరసింహారెడ్డి విచారణ జరిపారు. విచారణ చివరి దశకు చేరుకున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడడంపై న్యాయస్థానం తలుపు తట్టింది బీఆర్ఎస్.
కోర్టు ఆదేశాలతో న్యాయ విచారణ కమిషన్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లోకూర్‌ను నియమించింది. దీనిపై ప్రస్తుత విచారణ కొనసాగుతోంది. కొద్దిరోజుల్లో విచారణ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
ALSO READ: రూట్ మార్చిన పెద్దపులి.. ఆ జిల్లాలోకి ఎంట్రీ
బీఆర్ఎస్ పెద్దలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి. ఈ కేసుకు సంబందించి దర్యాప్తు స్పీడ్‌గా జరుగుతోంది. ఈ కేసులో చాలామంది అధికారులు అరెస్టయ్యారు.. జైలులో ఉన్నారు కూడా. ఈ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కీలక నిందితుడు ప్రభాకర్‌రావు అమెరికాకు చెక్కేశారు.
తొలుత ఆరోగ్యం సరిగా లేదంటూ చెప్పుకొచ్చిన ఆయన, గ్రీన్ కార్డు రావడంతో కూల్ అయ్యారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ యూఎస్ ప్రభుత్వానికి ఆయన లేఖ రావడంతో వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ సర్కార్ మాత్రం ప్రభాకర్‌రావును ఇండియాకు రప్పించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న వాటిలో ఫార్ములా ఈ-రేస్ వ్యవహారం ఒకటి. ఆర్బీఐ నిబంధనలు ఉల్లఘించి, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిర్వహణ సంస్థకు కోట్లాది రూపాయలు అప్పగించింది. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా మీడియా ముందు అంగీకరించారు కూడా. ఆ మొత్తంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నిధులు ఇవ్వడం అనేది కీలకంగా మారింది. ఈ కేసుకు త్వరలో ఫుల్‌స్టాప్ పడనుంది.
జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ సాగింది. రంగారెడ్డి జిల్లా జన్వాడ విలేజ్‌లో దాదాపు 4000 వేల చదరపు అడుగుల్లో దీన్ని నిర్మించారు. అయితే ఈ ఫామ్‌హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో రెవిన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
ఫామ్ హౌస్ నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దీని వ్యవహారం కాస్త నెమ్మదించింది. అధికారులు అంతర్గతంగా విచారణ చేస్తున్నారు. కొద్దిరోజుల్లో దీనిపై ఫుల్‌స్టాప్ పడనుంది. ఓవరాల్‌గా చూస్తే.. రెండో ఏడాదిలో పైనున్న కేసులు, విచారణలు కొలిక్కి రావడం ఖాయమన్నది అధికార పార్టీ నేతల మాట. అదే జరిగితే కారు పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవన్నమాట.