10th Class Student Suicide: తల్లిదండ్రుల మందలింపును స్ఫూర్తిగా తీసుకోవాల్సిన వయసులో.. క్షణికావేశానికి లోనై నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు నేటి విద్యార్థులు. “బాగా చదువుకో.. మంచి మార్కులు తెచ్చుకో” అని తండ్రి మందలించినందుకు మనస్తాపానికి గురై ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ మైసమ్మ నగర్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ మైసమ్మ నగర్‌లో రాకేష్, లత దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు కొల్లా అరవింద్ (15) గాంధీ నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి కీలకమైన సమయం కావడంతో, రాకేష్ తన కుమారుడి చదువు విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించాడు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో బాగా చదువుకోవాలని, మంచి మార్కులు సాధించాలని అరవింద్‌ను మందలించాడు. భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో తండ్రి చెప్పిన మాటలను అరవింద్ తప్పుగా అర్థం చేసుకున్నాడు.
తండ్రి మందలించడాన్ని అవమానంగా భావించిన అరవింద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు, ఫ్యాన్‌కు వేలాడుతున్న అరవింద్‌ను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే అతడిని కిందకు దించి, అత్యవసర చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అరవింద్ మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. చేతికి అందివచ్చిన కొడుకు, చిన్న కారణానికే ప్రాణాలు తీసుకోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
మృతుడి తండ్రి రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లల మానసిక స్థితిని గమనిస్తూ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: Two Autos Collided: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ.. స్పాట్‌లో ఎనిమిది మంది, ఇంతకీ ఎక్కడ?