Blast in Explosives Factory: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోటకొండూర్ మండలం కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రశాంతంగా పని చేసుకుంటున్న సమయంలో పేలుడు సంభవించడంతో కార్మికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.
18ఏ బ్లాక్‌లో పేలుడు జరగగా.. భవనం నేలమట్టం అయింది. ఫ్యాక్టరీ ముందు బైఠాయించిన గ్రామస్థులు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు.. శిథిలాల కింద చిక్కుకుని మరో ఇద్దరు మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీ సాయంతో శిథిలాల్లో చిక్కుకున్న వారికోసం గాలింపు చేపట్టారు. కంపెనీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో గ్రామస్తుల వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడులో చనిపోయిన సందీప్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సందీప్‌కు ఆరు నెలల క్రితమే పెళ్లికాగా.. భార్య గర్భవతిగా ఉంది. ఇంతలోనే సందీప్‌కు ప్రమాదంలో చనిపోవడం.. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
గతంలో ప్రమాదం జరిగిందని.. అప్పుడు హెచ్చరించినా నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు కంపెనీ యాజమాన్యం తక్షణమే పరిహారం చెల్లించాలని ఆదేశించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే తరుచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, యాజమాన్యం కేవలం ధనార్జనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుంది.. కానీ కార్మికుల సేఫ్టీనీ విస్మరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ప్రాణాలతో పరిశ్రమ చెలగాటమాడుతోందని విమర్శించారు.
Also Read: కోల్‌కతాలో ఘోరం.. ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం.. 14 మంది సజీవదహనం
ఎక్స్ ప్లోజీవ్ కంపెనీల్లో కార్మికులకు భద్రత లేకుండా పోతుంది. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు కనీస రక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారు. పరిశ్రమల్లో తనిఖీలు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. భారీ ప్రమాదాలు వల్ల కార్మికుల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి.