Hyderabad traffic: భాగ్యనగర వాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ట్రాఫిక్. ఒక్కోసారి కిలో మీటర్ దూరం ప్రయాణించాలంటే అరగంట సమయం పట్టొచ్చు. కొన్ని ఏరియాల్లో అయితే ట్రాఫిక్ సిగ్నిల్ వద్ద పది నుంచి 20 నిమిషాలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ సమస్య ఉద్యోగులను నరకయాతనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ భాగ్యనగర వాసులకు తీపికబురు చెప్పింది. నగరంలో ఇక నుంచి ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతాల్లో కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC), హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) రహదారుల పనులకు శ్రీకారం చుట్టునుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరంలో నూతన ఫ్లైఓవర్లు అందుబాటులోకి రానున్నాయి. రూ.5,942 కోట్లతో 38 రకాల నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టునున్నారు. దీని ద్వారా నగరంలో భారీగా ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది.
మొదటి దశలో 16 రకాల కీలక ప్రాజెక్టులను ప్రారంభించాలనే యోచనలో జీహెచ్ఎంసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 16.56 కిలోమీటర్ల మేర 10 ఫ్లైఓవర్ లు, అండర్ పాస్‌ల నిర్మాణం, 6.585 కిలోమీటర్ల మేర ఆరు ప్రధాన రహదారి విస్తరణ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ పనులన్నీ దాదాపు రూ.2400 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేయనున్నారు. నగరంలో ఫ్లైఓవర్ లు, అండర్ పాస్‌లు ప్రధాన కూడళ్లలో రద్దీని తగ్గించడానికి తోడ్పడుతాయి. రైల్వే అండర్ బ్రిడ్జెస్, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు ట్రాఫిక్ సమసయను సులభతరం చేయనున్నాయి. నగరంలో పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా ప్రధాన రహదారలు విస్తరణ జరగనుంది. కాసు బ్రహ్మానంద పార్కు చుట్టూ స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించనున్నారు. కుత్బుల్లాపూర్ లోని ఫాక్స్ సాగర్ మిగులు నాలాపై నాలుగు లేన్ల స్టీల్ గిర్డర్ వంతెనను నిర్మించనున్నారు.
హైదరాబాద్ రోడ్డు నెట్ వర్క్ ను మెరుగు పరచడానికి జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మహారాజా, కేబీఆర్ పార్క, ముగ్దా అగ్రసేన్, క్యాన్సర్ హాస్పటిల్ ప్రాంతాల్లో 6.5 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. అదనంగా ఖాజాగూడాలో 1.52 కి.మీ, శేరిలింగంపల్లిలో 3.25 కి.మీ, విప్రో జంక్షన్ లో 1.05 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించనున్నారు.
మెహిదీపట్నం నుంచి హైటెక్‌సిటీకి వెళ్లే వాహనాలు ప్రస్తుతం ఖాజాగూడ చౌరస్తాలో నిలిచిపోతున్నాయి. దీంతో టోలిచౌకి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాల కోసం కూడలిలో అండర్‌పాస్, నానక్‌రామ్‌గూడ నుంచి టోలిచౌకి వైపు వెళ్లే మార్గంలో ఓ పైవంతెన అందుబాటులోకి తేనున్నారు. ట్రిపుల్ ఐటీ చౌరస్తా నుంచి ORRకు నేరుగా వెళ్లేలా.. విప్రో చౌరస్తాపై ఐఎస్‌బీ రోడ్డు- ఓఆర్‌ఆర్ దిశలో నాలుగు లైన్ల ఫ్లైఓవర్, దానికి కొనసాగింపుగా ICII చౌరస్తాలో నాలుగు లైన్ల అండర్‌పాస్ అందుబాటులోకి తేనున్నారు. ట్రిపుల్ ఐటీ కూడలిలో మూడు ఫ్లైఓవర్, ఓ అండర్‌పాస్‌ను అందుబాటులోకి రానుంది. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి గచ్చిబౌలి చౌరస్తా వరకు 215 అడుగుల వెడల్పుతో ప్రస్తుతం ఉన్న రోడ్లను విస్తరించనున్నారు. చింతల్‌లోని ఫాక్స్‌సాగర్ వరద నాలాపై నాలుగు లైన్ల స్టీలు బ్రిడ్జి నిర్మాణం అందుబాటులోకి తేనున్నారరు. అంజయ్యనగర్ నుంచి రాంకీ టవర్స్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతారు.
Also Read: Nampally Railway Station: త్వరలో నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత.. ఎందుకంటే..?
భాగ్య నగరంలో ఫ్లై ఓవర్లు, అండర పాస్‌లు, రోడ్ల విస్తరణ పనులు అందుబాటులోకి వచ్చాక ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. త్వరలో ఇవన్నీ అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్యలు తీరాలని కోరుకుందాం.