
Medical Colleges : తెలంగాణ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో 8 వైద్య కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. గద్వాల, నారాయణపేట, ములుగు, యాదాద్రి, మెదక్, వరంగల్ జిల్లా నర్సంపేట, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ , రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది.
ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. దీంతో రాష్ట్రంలో అదనంగా 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. అలాగే రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరుతుంది. కొత్త వైద్య కళాశాలలకు భవనాల నిర్మాణ బాధ్యతను ఆర్ అండ్ బీకి పరికరాలు, ఇతర వసతుల కల్పనను టీఎస్‌ఎంఎస్‌ఐడీకి అప్పగించింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు వైద్య విద్యతోపాటు పేదలకు స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. విద్యార్థులు వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరంలేకుండా చేస్తున్నామన్నారు. సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుసరిస్తోంది అనే నినాదానికి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటే నిదర్శనమని హరీశ్ రావు స్పష్టం చేశారు.