Aadi Srinivas: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ పనిపాటా లేక చిట్‌చాట్‌ల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతిరోజూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో.. కనీసం మీడియాలోనైనా ఉండాలనే ఆరాటంతోనే కేటీఆర్ ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు.
పేదలకు ఊపిరి పోస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఉసురు పోసుకుంటోందని కేటీఆర్ ఊసుపోని కబుర్లు చెబుతున్నారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి పేదల ఉసురు పోసుకున్నది ఎవరో.. పేదలకు ఊపిరి పోస్తున్నది ఎవరో.. తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని ఆయన అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏనాడూ పేదలను పట్టించుకోని కారణంగానే, అసెంబ్లీ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఊసు లేకుండా చేశారని.. భవిష్యత్తులో వారి ఉనికే లేకుండా చేస్తారని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ హయాంలో కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు ఇవ్వకుండా పేదల ఉసురు తీశారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 4.63 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసిందని, వితంతువులు, ఒంటరి మహిళలకు వంద శాతం, లక్ష మంది దివ్యాంగులకు, డయాలసిస్, బోదకాలు రోగులకు పింఛన్లు అందిస్తున్నామని వివరించారు. అలాగే రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు.
సోనియా గాంధీని మోసం చేసిన చరిత్ర మీది
రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి బాడీగార్డ్‌గా వ్యవహరించారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఆది శ్రీనివాస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నమ్మిన నాయకుడి కోసం ప్రాణం ఇచ్చే తత్వం తమదని, బీఆర్ఎస్ నేతల్లా నమ్మించి గొంతు కోసే చరిత్ర తమది కాదని అన్నారు. ఆనాడు టీఆర్ఎస్ కోసం పనిచేసిన ఎంతో మంది నాయకులను మోసం చేశారని, తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి సోనియాగాంధీని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియమ్మ కాళ్లకు మొక్కి వెన్నుపోటు పొడిచింది కల్వకుంట్ల కుటుంబమేనని మండిపడ్డారు. త్యాగాల కుటుంబమైన గాంధీల గురించి, సోనియాగాంధీ పేరు ఎత్తే నైతిక అర్హత కూడా వారికి లేదని, సోనియమ్మ ఆత్మకథలో అలాంటి నమ్మకద్రోహులకు స్థానం ఉండదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Also Read: అసదుద్దీన్ మోదీకి శత్రువా? మిత్రుడా? యూపీలో ఏం జరుగుతోంది?