Formula E Race Case: ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు జోరందుకుంది. ఈ కేసులో భాగంగా బుధవారం ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు అరవింద్ కుమార్. ఆయన ఏ-2 గా ఉన్నారు. అరవింద్‌కుమార్ స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు ప్రత్యేక అధికారులు. ఈ కేసు విషయంలో ఇప్పటికే ఫిర్యాదుదారు ఐఏఎస్ దానకిషోర్ స్టేట్‌మెంట్ తీసుకుంది. దాదాపు ఏడు గంటలపాటు ఆయన చెప్పినదంతా వీడియో రూపంలో రికార్డు చేసింది.
మంగళవారం గ్రీన్ కో కంపెనీలపై సోదాలు చేసింది ఏసీబీ. అందులో లభించిన డాక్యుమెంట్లు, దాన కిషోర్ నుంచి సేకరించి వివరాలు అన్నింటినీ దగ్గర పెట్టి అరవింద్‌కుమార్‌ను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అవి ఈ కేసుకు కీలకంగా మారనున్నట్లు సమాచారం. అరవింద్ తర్వాత హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్‌రెడ్డి వంతు కానుంది. ఆయన నుంచి వివరాలు నమోదు చేసిన తర్వాత చివరకు కేటీఆర్ హాజరకానున్నారు. ఏసీబీ రికార్డు చేసిన వివరాలు ఈడీ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీ జరిగినప్పుడు అరవింద్ కుమార్ కీలక విషయాలు బయటపెట్టారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నిధులను ఎఫ్ఈవోకు బదిలీ చేసినట్టు ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకున్నారు. దీని ఆధారంగా పలు ప్రశ్నలు రెడీ చేశారు అధికారులు. ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. డబ్బుల బదిలీలో కీలకంగా వ్యవహరించిన హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఈడీ ముందుకు హాజరయ్యారు.
మరోవైపు ఈనెల 9న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఈ నేపథ్యంలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆ పిటిషన్‌పై విచారణ జరపనుంది. రేపు ఏసీబీ విచారణకు తనతోపాటు తన న్యాయవాదిని అనుమతించాలంటూ ప్రధానంగా ప్రస్తావించారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి నిరాకరించింది ఏసీబీ.
ALSO READ: గ్రీన్ కో.. క్విడ్ ప్రోకో! చూసింది గోరంతే.. తెలియాల్సింది కొండంత!
ఇదిలావుండగా క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని అందులో ప్రస్తావించారు. కేటీఆర్ పిటిషన్‌కు ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ సర్కార్. తమ వాదనలు వినకుండా కేటిఆర్ పిటీషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ పేర్కొన్న విషయం తెల్సిందే.