Bandi Sanjay Reaction On Animal fat being used in Tirupati Laddu: తిరుపతి లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించిందంటూ ఆయన సీరియస్ అయిన విషయం తెలిసిందే.
చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటి నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అటు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు వచ్చి దర్శించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలిసి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
Also Read: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్
సోషల్ మీడియా (ఎక్స్)లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విధంగా పోస్ట్ పెట్టారు. ‘లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడి తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులు, హిందూ భక్తుల పట్ల నమ్మకాన్ని వమ్మూ చేశారు. ఇది కావాలనే హిందూ భక్తులకు పెద్ద మోసం చేశారు. ఈ విషయంలో బాధ్యులను దేవుడు అస్సలు క్షమించడు.
టీటీడీ బోర్డులో ఇతర మతస్థులు, ఉద్యోగులు ఉంటే ఇటువంటి పరిస్థితులకే దారి తీస్తుందని గతంలో కూడా మేం ఆందోళన వ్యక్తం చేశాం. అయినా పట్టించుకోలేదు.
Also Read: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యతను కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. అదేవిధంగా లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడకం విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ కేంద్ర మంత్రి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.