Anjaiah Nagar: స్వేచ్చ బ్యూరొో: అంజయ్యనగర్‌లో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం ఉదంతంలో సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన సాజిద్ కారు మెకానిక్ గా మొదలుపెట్టి కొందరు రాజకీయ నాయకులు.. అధికారుల అండతో బిల్డర్ గా ఎదిగినట్టు విచారణలో వెళ్లడయ్యింది. అతను కట్టిన మొదటి భవనం ప్రభుత్వ పార్క్ స్థలంలో అని తేలింది. దానిని అమ్మటం ద్వారా భారీ మొత్తంలో డబ్బు కూడబెట్టుకున్న సాజిద్ ఆ తర్వాత బిల్డర్ గా అవతారం ఎత్తినట్టుగా తెలిసింది.
అంజయ్యనగర్ లో శనివారం నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయిన విషయం తెలిసిందే. దీంట్లో ఉపాధిని వెతుక్కుంటూ మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి టైల్స్ కార్మికులుగా పని చేస్తున్న ఉమేశ్, మహబత్ మృత్యువాత పడ్డారు. కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ పై పడటంతో మరికొందరికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కాగా, భవనం కూలిపోయిన వెంటనే సాజిద్ పరారయ్యాడు. అతని కోసం ముమ్మర వేటను సాగించిన రాయదుర్గం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
ఇటు పోలీసులు అటు సైబరాబాద్ మున్సిపల్ అధికారులు జరిపిన విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. సాజిద్ 50గజాల స్థలంలో ఈ ఏడంతస్తుల భవనం కట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ 50గజాల్లో నాలాకు చెందిన 10గజాల స్థలం ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. దానిని కబ్జా చేసి సాజిద్ భవనాన్ని కట్టించినట్టుగా తేలింది. దాంతోపాటు నిర్మాణ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని వెళ్లడయ్యింది. సరైన పునాదులు, ఇంజినీరింగ్ ప్లాన్ లేకుండానే ఈ ఏడంతస్తుల భవనాన్ని కట్టించినట్టుగా స్పష్టమయ్యింది. ఇప్పటివరకు సాజిద్ అంజయ్యనగర్ లో 5బిల్డింగులు కట్టించినట్టు సమాచారం. ఇవన్నీ అక్రమ నిర్మాణాలే అని అధికారులు చెబుతున్నారు. శనివారం తాను కట్టించిన భవనం కూలినపుడు సాజిద్ అంజయ్యనగర్ లో తాను కట్టిస్తున్న మరో అక్రమ బిల్డింగ్ స్లాబ్ పనులు చేయిస్తూ ఉన్నట్టు తెలిసింది. ఇద్దరు చనిపోయారని తెలియగానే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పరారైనట్టు సమాచారం.
Also read: పరికిణీలో కుర్రకారు హృదయాలు దోచుకుంటున్న ‘రంభ ఊర్వశి మేనక’ బ్యూటీ!
అయిదేళ్ల క్రితం సాజిద్ తన తండ్రి వద్ద కారు మెకానిక్ గా పని చేశాడు. ఈ క్రమంలో కార్లు రిపేర్ చేయించుకోవటానికి వచ్చిన కొందరు లోకల్ లీడర్లతో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయి. వారి ద్వారా అవినీతికి మరిగిన కొందరు అధికారులతో పరిచయాలయ్యాయి. వీరి అండదండలతో సాజిద్ మొదట ప్రభుత్వ పార్క్ స్థలాన్ని కబ్జా చేసి భవనం కట్టాడు. దానిని అమ్మి భారీ మొత్తంలో డబ్బు వెనకేసుకున్నాడు. ఆ తర్వాత తొండ ముదిరి ఊసరవెల్లిగా మారిందన్న చందాన పేదలను బెదిరించి వారికి ఉన్న నలభై.. యాభై.. అరవై గజాల స్థలాలను తక్కువ ధరకే హస్తగతం చేసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే భవనాలను కట్టించి అమ్ముతూ వస్తున్నాడని తెలుస్తోంది.
గడిచిన మూడేళ్లలో ఇలా అయిదు బిల్డింగులు కట్టినట్టు సమాచారం. కొందరు అధికారుల జేబులు తడపటంతో ఈ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాజిద్‌కు సహకరిస్తున్నది ఎవరు, ఎవరెవరితో కలిసి ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టాడు? అన్నదానిపై దానిపై హైడ్రా, పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రమాద స్థలంలో ఆదివారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. బిల్డింగ్ కూలిన సమయంలో శిథిలాలు పడి పక్కనున్న అపార్ట్‌మెంట్ లోని 10 ఫ్లాట్స్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. ప్రమాదకరంగా మారిన ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు.
అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమైన మాదాపూర్ టౌన్‌ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ ను సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన సస్పెండ్ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు. అనుమతి లేనిదే హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లవద్దని సూచించారు. ఇక, రాయదుర్గం పోలీసులు బిల్డర్ సాజిద్ పై బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 105 BNS ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
Also read: యూడైస్ ప్లస్ లెక్కలతో బట్టబయలైన డొల్లతనం.. కూటమి సర్కార్‌పై వైఎస్ జగన్ ఫైర్!