Ayyappa Devotees Protest: రూల్స్ పేరు చెప్పి కొన్నిసార్లు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఆ అత్యుత్సాహం వల్ల చివరికి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటు చేసుకుంది. తొర్రూర్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో డ్యూటీకి వచ్చే డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో అయ్యప్పమాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు కూడా అక్కడే ఉన్నారు. సాధారణంగా అయ్యప్పమాల ధరించివారు చాలా పవిత్రంగా ఉంటారు.
Also read: హైదరాబాద్ లో మరో చెరువును కాపాడిన హైడ్రా.. నిఘా పెట్టిమరీ
ఒకేపూట భోజనం చేయడంతో పాటూ తెల్లవారుజామునే స్నానం చేసి చాలా నిష్టగా ఉంటారు. అలాంటి వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం అవసరమే లేదు. కానీ క్యూలో నిలుచున్న నాగరాజుకు కూడా అధికారులు టెస్ట్ చేశారు. తాను మాలలో ఉన్నానని మత్తు పధార్థాలు అస్సలు తీసుకోనని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. కచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని… అందరికీ ఒకే రూల్ ఉంటుందని చెప్పారు.
ఎంత చెప్పినా వినకుండా టెస్ట్ చేయడంతో అక్కడ ఉన్నవాళ్లు దీనిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్పమాల ధరించిన వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరోవైపు ఈ ఇష్యూపై అయ్యప్ప స్వామి భక్తి మండలి సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మండలి ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు ధర్నాకు స్వాములు ధర్నాకు దిగారు. డిపో మేనేజర్ వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. అయ్యప్పలకు వెంటనే క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. డిపో మేనేజర్ వచ్చి క్షమాపణ చెప్పడంతో స్వాములు వెనక్కి తగ్గారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని స్వాములకు హామీ ఇచ్చారు.