Balapur Ganesh Laddu: బాలాపూర్ గణేశ్ శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 21 కిలోమీటర్ల పొడువున ఉన్న శోభయాత్రకు పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలితో పాటు వివిధ విభాగాల అధికారులు ఇప్పటికే పలుమార్లు నేరుగా పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో బాలాపూర్ వినాయకుడిని మధ్యాహ్నం ఒంటిగంట కన్నా ముందు చార్మినార్ దాటించి, సాయంత్రం 4 గంటల కల్లా నిమజ్జనం జరిగేలా పోలీసులు వ్యూహం సిద్ధం చేసినట్లు తెలిసింది.
బాలాపూర్ గణేష్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ గణేష్‌కు ఉండే ప్రత్యేకత వేరే అని చెప్పాలి. హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో కొలువుదీరే ఈ గణేషుడు చాలా స్పెషల్. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయనకు ఎంత ప్రత్యేకత ఉంటుందో.. ఆయన లడ్డూకు అంతకంటే ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ప్రతీ ఏడాది ఆ లడ్డూ ధర అంతకంతకు పెరుగుతూ ఆకాశంవైపు పరిగెడుతూనే ఉంది. గతేడాది ఏకంగా 30 లక్షల ఒక వెయ్యి రూపాయలు పలికింది ఈ గణేషుడి లడ్డూ ధర.
30 ఏళ్ల కిందట తొలిసారి 450 రూపాయాలు పలికిన ఈ లడ్డు.. ప్రతీ ఏడాది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతూనే ఉంది. బాలాపూర్ విఘ్నేషుడి లడ్డూను దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడుతుంటారు. ఈ లడ్డూ ఎంతో మహత్యం కలిగినదిగా భావిస్తారు. ఈ లడ్డూను దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తారు. ఒక్కసారి ఈ లడ్డూను దక్కించుకుంటే తమ జీవితాలు మారుతాయనేది వారి నమ్మకం. అందుకే పోటాపోటీగా ధర పెంచుతూ పోతుంటారు.
1980లో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. కానీ లడ్డూ వేలంపాట ప్రారంభమైంది మాత్రం 1994లో. ఆ ఏడాది వేలంలో 450లకు బాలాపూర్ గణపతి లడ్డూను కొలను మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు బాగా కలిసివచ్చిందని చెబుతారు. అప్పటి నుంచి వేలం ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. తొలి వేలంలో లడ్డూ దక్కించుకున్న కొలను మోహన్ రెడ్డి.. తర్వాతి ఏడాది కూడా 4 వేల 500 రూపాయలకు లడ్డూను వేలంలో సొంతం చేసుకున్నారు. ఇలా ప్రతి ఏడాది వేలంలో బాలాపూర్ గణనాథుని లడ్డూ ప్రసాదం ధర పెరుగుతూనే ఉంది.
ఇలా ప్రతి ఏడాది పెరుగుతూ వచ్చిన లడ్డూ ధర 2002లో తొలిసారి లక్ష రూపాయలు దాటింది. 2004లో రెండు లక్షలు.. 2006లో మూడు లక్షలు.. 2007లో నాలుగు లక్షలు.. 2008లో 5 లక్షలు దాటేసింది. ఇక 2015లో ఏకంగా పది లక్షల 32 వేలు పలికింది ఈ లడ్డూ ధర. ఆ తర్వాత ఏడాది అంటే 2016లో ఏకంగా 14 లక్షల 65 వేలకు చేరుకుంది. 2017లో 15 లక్షలు దాటేసింది బాలాపూర్ గణనాథుడి లడ్డూ ధర.
అయితే కరోనా కారణంగా 2020లో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ.. లడ్డూ వేలాన్ని రద్దు చేసింది. 2021లో 18 లక్షల 90 వేలు పలికిన ఈ లడ్డూ ధర.. ఆ తర్వాత ఏడాదిలో ఒకేసారి 24 లక్షల 60 వేలకు చేరుకుంది. ఇక గతేడాది 30 లక్షలకు చేరుకుంది . దీంతో ఈ సారి ఈ లడ్డూ వేలం ఎక్కడికి వెళుతుంది? ఎన్ని లక్షలు చెల్లించి ఈ లడ్డూను ఎవరు దక్కించుకుంటారన్న క్యూరియాసిటీ ఇప్పటికే పెరిగింది.
Also Read: మనుషులా..? పశువులా..? రోస్టింగ్ పేరుతో రోత.. సైకో చేష్టల కోత్త చట్టం..!
బాలాపూర్ గణనాథునికి చివరి పూజ తర్వాత స్థానికంగా విహరింపజేస్తారు. ఆ తర్వాత బాలపూర్ బొడ్రాయి దగ్గర వేలం పాట నిర్వహిస్తారు. మొదట్లో స్థానికులు మాత్రమే వేలంలో పాల్గొనే వారు.. కానీ రాను రాను ఇతర ప్రాంతాల వారు కూడా వేలంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. లడ్డూ వేలంలో వచ్చే సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు.
గత 31 ఏళ్లుగా బాలాపూర్ లడ్డూ వేలం పాట..
1994 – కొలను మోహన్ రెడ్డి – రూ.450
1995 – కొలను మోహన్ రెడ్డి – రూ.4,500
1996 – కొలను కృష్ణారెడ్డి – రూ.18,000
1997 – కొలను కృష్ణారెడ్డి – రూ.28,000
1998 – కొలను మోహన్ రెడ్డి – రూ.51,000
1999 – కల్లం అంజిరెడ్డి – రూ.65,000
2000 – కల్లం ప్రతాప్ రెడ్డి – రూ.66,000
2001 – జీ రఘునందన్ చారి – రూ.85,000
2002 – కందాడ మాధవరెడ్డి – రూ.1,05,000
2003 – చిగిరింత బాల్ రెడ్డి -రూ.1,55,000
2004 – కొలను మోహన్ రెడ్డి – రూ.2,01,000
2005 – ఇబ్రం శేఖర్ – రూ.2,08,000
2006 – చిగిరింత తిరుపతి రెడ్డి – రూ.3,00,000
2007 – జీ రఘునందన్ చారి – రూ.4,15,000
2008 – కొలను మోహన్ రెడ్డి – రూ.5,07,000
2009 – సరిత – రూ.5,10,000
2010 – కొడలి శ్రీధర్ బాబు -రూ.5,35,000
2011 – కొలను బ్రదర్స్ – రూ.5,45,000
2012 – పీ గోవర్దన్ రెడ్డి -రూ.7,50,000
2013 – తీగల కృష్ణా రెడ్డి -రూ.9,26,000
2014 – సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ.9,50,000
2015 – కల్లెం మదన్ మోహన్ రెడ్డి – రూ.10,32,000
2016 – స్కై లాబ్ రెడ్డి – రూ.14,65,000
2017 – నాగం తిరుపతి రెడ్డి – రూ.15,60,000
2018 – టీ శ్రీనివాస్ గుప్తా – రూ.16,60,000
2019 – కొలను రామ్ రెడ్డి – రూ.17,60,000
2020 – కరోనా కారణంగా వేలం రద్దు
2021 – ఏపీకి చెందిన రమేష్ బాబు, నాదర్‌గుల్‌కు చెందిన మర్రి శశాంక్ రెడ్డి – రూ.18,90,000
2022 – వంగేటి లక్ష్మారెడ్డి – రూ.24,60,000
2023 – దాసరి దయానంద్ రెడ్డి – రూ.27,00,000
2024 – కొలను శంకర్ రెడ్డి -రూ.30,01,000
ఈసారి వేలంలో పాల్గొనేవారు..
మర్రి రవి కిరణ్ రెడ్డి (చంపాపేట్)
అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి (ఎల్బీనగర్)
లింగాల దశరథ్ గౌడ్ (కర్మాన్‌ఘాట్)
కంచర్ల శివారెడ్డి (కర్మాన్‌ఘాట్)
సామ రామ్ రెడ్డి (దయ) (కొత్తగూడ, కందుకూర్)
పి ఎస్ కే (PSK) గ్రూప్ (హైదరాబాద్)
జిట్టా పద్మ సురేందర్ రెడ్డి (చంపాపేట్)