Bandi Sanjay – KTR: లీగల్ నోటీసులకు భయపడేది లేదు.. నా వ్యాఖ్యల్లో తప్పేలేదు.. నాకే కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ రివర్స్ అటాక్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మాజీ మంత్రి కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు.
ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి, బండి సంజయ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ.. బీఆర్ఎస్ పాలనలో ట్యాపింగ్ జరిగిందని విమర్శలు చేశారు బండి సంజయ్. అలాగే ఇటీవల గ్రూప్స్ పరీక్షలు, మోకీలా డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై, కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయంపై అదేరోజు తాను నోటీసులకు సమాధానం ఇస్తానంటూ.. మంత్రి కూడా ప్రకటించారు.
తాజాగా తన న్యాయవాది నవీన్ ద్వారా నోటీసులకు సమాధానాన్ని కేంద్ర మంత్రి పంపించారు. తనకు ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ నోటీసులు పంపించారని, ఎటువంటి ఆధారాలు లేకుండా పంపినట్లు రిప్లై నోటీసులో పేర్కొన్నారు. ఇటీవల మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని నాయకులతో సమావేశమైన కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండవచ్చని స్వయంగా ప్రకటించినట్లు, తాను అదే మాటలను చెప్పినట్లు బండి సంజయ్ తెలిపారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన పరిణామాలపై మాత్రమే తాను మాట్లాడానని, తనకు ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ ను వ్యక్తిగతంగా విమర్శించే ఆలోచన లేదన్నారు. తన నోటీసులను వెనక్కి తీసుకొని, కేటీఆర్ 7 రోజుల్లో క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ పంపిన నోటీసులో తెలిపారు. అంతేకాదు బీఆర్ఎస్ పాలన సమయంలో టీ.ఎస్.పీ.ఎస్.సీ పరీక్ష నిర్వహణలో విఫలం కాలేదా అంటూ లేఖలో పేర్కొనడం కూడా విశేషం. ఈ నెల 19వ తేదీన జరిగిన సమావేశంలో తాను కేటీఆర్ గురించి ఎటువంటి కామెంట్స్ చేయలేదని కూడా నోటీసులో పేర్కొన్నారు బండి సంజయ్. తనకు సారీ చెప్పకుంటే తాను కూడా న్యాయపోరాటానికి సిద్దమంటూ నోటీసులో తెలపడం మరో విశేషం.
ఇలా వీరిద్దరి మధ్య ప్రస్తుతం నోటీసుల వార్ సాగుతుండగా, 7 రోజుల్లో కేటీఆర్ క్షమాపణలు చెప్పాలన్న నోటీసుకు కేటీఆర్ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి కేటీఆర్ రిప్లై కూడా ఘాటుగానే ఉంటుందని, ఇప్పుడే వీరి మధ్య నెలకొన్న నోటీసుల వార్ కు ముగింపు పడదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.