Bandi Sanjay: ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ అంశంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడి రాజ్యాంగ విలువలకే మచ్చ తెచ్చిన నాయకులకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు అని ఆయన మండిపడ్డారు.
అవకాశవాద రాజకీయాలకు గట్టి దెబ్బ
ఒక పార్టీ గుర్తుపై గెలిచి, అధికార ఆశతో మరో పార్టీలోకి మారే సంస్కృతి ప్రజాస్వామ్యానికి తీవ్ర హానికరమన్నారు.. ‘ఆయారాం.. గయారాం’ తరహా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అనర్హత వేటు పడుతుందని తేలిపోవడంతో మళ్లీ సొంత గూటికి చేరుతామంటూ ప్రకటించడం వారి అవకాశవాదానికి అద్దం పడుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తూ.. కొన్ని మీడియా సంస్థల ద్వారా వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తుండటం దారుణమన్నారు.
ఖైరతాబాద్‌లోనే బుద్ధి చెప్పాలి
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడం ఇక అనివార్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా తీర్పును కాలరాసి, అనైతిక ఫిరాయింపులకు పాల్పడిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా లేదన్నారు. రాబోయే రోజుల్లో ఏ నాయకుడైనా ఫిరాయింపులకు పాల్పడాలంటే భయపడేలా ప్రజలే తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఖైరతాబాద్ వేదికగా ఈ రెండు పార్టీలను రాజకీయంగా నిమజ్జనం చేసి, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని ఆయన ప్రజలకు, ముఖ్యంగా హిందూ బంధువులకు పిలుపునిచ్చారు. అనైతిక రాజకీయాలకు కాలం చెల్లిందని ఈ ఉప ఎన్నిక తీర్పు ద్వారా స్పష్టం చేయాలని కోరారు.
Also Read: బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!