Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ఏర్పాటులో కాషాయ పార్టీ ప్రధాన భూమిక పోషించిందని, కానీ మాజీ సీఎం కేసీఆర్ డ్రామాల వల్లే తెలంగాణ కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమం ప్రజలకు కనిపించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వేడుకలకు బండి హాజరై మాట్లాడారు.
కేసీఆర్ కుటుంబంపై బండి ఆరోపణలు
సుష్మ స్వరాజ్ హెచ్చరికతోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. అయితే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితులు ఏమాత్రం మారలేదని ఆయన పేర్కొన్నారు. అనుకున్న రాష్ట్రాన్ని సాధించుకున్నామా? లేదా? అనేది ప్రజలు ఆలోచించాలని బండి సంజయ్ కోరారు. తెలంగాణ ప్రజల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమకారుల రూపంలో కేసీఆర్ కుటుంబం ఉద్యమంలో దూరి సంపాదించుకుందని ఆరోపించారు. పార్లమెంట్ లో జరిగిన చర్చలో అసలు కేసీఆర్ పాల్గొనలేదని సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ దొంగ దీక్షలు చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం
ఇకపోతే.. కాంగ్రెస్ ది సీసీసీ(కరెక్షన్, కరెప్షన్, కలెక్షన్) ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పై ప్రజలు అసహనంతో ఉన్నారని, కాంగ్రెస్ ను ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు. దీన్ని ప్రజలు గుర్తించాలన్నారు. కేంద్రం నిధులు ఇస్తే ఎక్కడ కేంద్రానికి పేరు వస్తుందో అని వాటిని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కేంద్ర నిధులు దారి మళ్లుతున్నాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేస్తోందన్నారు. పంట ఉత్పతి ముందు రాష్ట్రాలతో కేంద్రం సమీక్ష నిర్వహిస్తుందని, అయితే అందులో తెలంగాణలో పండుతున్న పంటల వివరాలు ఇవ్వాలన్నారు.
బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తేనే..
కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇండెంట్ ఇవ్వలేదని ఆయన ఫైరయ్యారు. తెలంగాణలో ప్రభుత్వం నడవడమే కష్టంగా ఉంటే.. ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ చేపట్టిన బస్సు యాత్రతో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తేనే.. అప్పులు తీరి తెలంగాణ అభివృది చెందుతుందన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా అవినీతిమయమైందని, నిజాయితీగా, కమిట్ మెంట్ తో పనిచేసే పార్టీకి అధికారం ఇవ్వాలని సంజయ్ సూచించారు.
ఒక్కసారి అవకాశం ఇవ్వండ.. బండి సంజయ్
ప్రజలు అన్ని పార్టీలకు అవకాశం కల్పించారని, ఒకసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరారు. సీఎం విబేధాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని బండి మండిపడ్డారు. ఇచ్చిన హామీలను దృష్టి మళ్లించేందుకు పక్క రాష్ట్రంపై నిందలు వేస్తున్నారన్నారు. కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర సహకరించిందని, సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలన్నారు. సీఎంకు చేతకాకుంటే మహారాష్ట్ర సీఎం అపాయింట్ మెంట్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పిస్తారని సూచించారు.
Also Read: 2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!