Bhatti Vikramarka latest news(Telangana today news): యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే ఏడాది మార్చి లోపు ఎట్టి పరిస్థితిలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని జెన్ కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో జెన్‌కో ఉన్నతాధికారులతో యాదాద్రి పవర్ ప్లాంట్ పనుల గురించి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. మొదటి యూనిట్ అక్టోబర్ 30, ఐదవ యునిట్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్లాంట్‌లో పని చేస్తున్న కొంతమంది అధికారులు, సిబ్బంది జ్వరాలతో బాధపడుతున్నారని. అందుకే పనులు ఆలస్యంగా జరుగుతున్నట్లు సమావేశంలో అధికారులు వివరించారు. దీంతో సిబ్బంది సంక్షేమమే ప్రధానమని వెంటనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు.అధికారులు, కార్మికుల భద్రతకు ఎన్ని నిధులు అయినా ఖర్చు చేసేందుకు వెనకాడవద్దని తెలిపారు. అధికారులు, కార్మికులు స్థానికంగా నివసించేందుకు వెంటనే క్వార్టర్ల నిర్మాణం కోసం టెండర్లకు పిలవాలని అన్నారు.
Also Read: 20 ఏళ్లు సీఎంగా రేవంత్ రెడ్డే.. కేసీఆర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి
స్థానికంగా నివసించేందుకు ఇబ్బందులు ఉండటం వల్ల క్వార్టర్లు నిర్మించే వరకు మిర్యాల గూడ, దామర చర్ల నుంచి సిబ్బందిని తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి బూడిద తరలించేందుకు తాళ్ల వీరప్పగూడెం, దామర చర్లకు నాలుగు వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రగతిపై వారంలోగా తనకు నివేదిక సమర్పించాలని అన్నారు. త్వరలో ప్లాంట్‌ను సందర్శించి.. అధికారులు సిబ్బందితో భేటీ అవుతానని అన్నారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.