Bhatti Vikramarka: దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంతో పాటు, సామాజిక మార్పులకు, అభివృద్ధికి బాటలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడారు.
“1885 డిసెంబర్ 28న ముంబైలో కేవలం 26 మందితో ప్రారంభమైన కాంగ్రెస్ ప్రస్థానం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి స్వాతంత్య్రం సాధించే స్థాయికి ఎదిగింది. దేశంలో అసమానతలను తొలగించి, హిందూ-ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందించింది. ఆహార ధాన్యాల కొరత ఉన్న రోజుల్లో విప్లవాత్మక మార్పులు (White Revolution) తీసుకొచ్చి, దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చింది. భూమి లేని నిరుపేదలకు లక్షలాది ఎకరాల భూములను పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే.” అని భట్టి గుర్తుచేశారు.
విద్య, సాంకేతిక రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలపడంలో ఐఐటీలు (IITs), నవోదయ, సెంట్రల్ స్కూల్స్ ఏర్పాటు కాంగ్రెస్ దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. బ్యాంకుల జాతీయీకరణ ద్వారా ఆర్థిక ఫలాలను సామాన్యులకు అందించామన్నారు. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చి, రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు.
పేదలకు కూలీ గిట్టుబాటు కాక ఇబ్బంది పడుతున్న సమయంలో, ఎలాంటి అల్లర్లు లేకుండా ‘మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని’ తెచ్చింది కాంగ్రెస్సేనని భట్టి చెప్పారు. అయితే, నేటి కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు పొడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి, పథకాన్ని నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రకటించారు. “జనవరి 26 నుంచి కాంగ్రెస్ పార్టీ ‘జెండా పండుగ’ నిర్వహిస్తాం. ప్రతి ఇంటిపై కాంగ్రెస్ జెండా ఎగిరేలా చూస్తాం. పార్టీ చేసిన త్యాగాలు, పేదలకు అందించిన పథకాలను వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలు పంచుతాం,” అని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పేదలకు మేలు చేసేది కేవలం కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
Read Also:Nalgonda Tragedy: నీళ్లనుకుని కొడుక్కి కెమికల్ ఇచ్చిన తల్లి.. రెండు గుటకలు తాగగానే