BJP – indiramma indlu scheme : తెలంగాణలోని పేదలకు అందించనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల అర్హులను ఎంపికకు ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీల ఏర్పాటును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఇళ్ల అర్హుల ఎంపికకు గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడి సర్కార్ నిర్ణయించారు. అలా చేయడం చట్టవిరుద్ధమంటూ రాష్ట్ర బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరు పక్షాల వాదనలు విని ప్రభుత్వ ఉద్దేశ్యంలో ఎలాంటి లోపాలు లేవని అభిప్రాయపడింది. ఈ మేరకు.. బీజేపీ శాసససభా పక్షం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. న్యాయస్థానాలు విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమంటూ తీర్పు వెలువరించింది.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించినట్లుగానే.. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేదవారికి సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తిరిగి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా.. ప్రభుత్వ ప్రాథామ్యాలకు అనుగుణంగా అసలైన అర్హుల్ని ఎంపిక చేసేందుకు గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కమిటీల ఏర్పాటు అధికారాన్ని జిల్లా కలెక్టర్ కు కట్టబెడుతూ.. జీవో 33 జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన బీజేపీ శాసనసభా పక్షం, మరికొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందిరమ్మ కమిటీలకు అధికారులు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని వాదించిన పిటిషనర్లు.. ఎన్నికల ద్వారా ఎంపికైన గ్రామ పంచాయతీ, వార్డు సభ్యలకు చోటు లేకపోవడం సరైంది కాదని వాదించింది. గతంలో డబుల్ బెడ్ రూమ్ పథకం లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేశామని, కానీ.. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడం విరుద్ధమన్నారు. పైగా ఈ కమిటీల్లోని సభ్యుల ఎంపికకు అనుసరించాల్సిన అర్హతల్ని తెలపలేదని వెల్లడించింది.
పిటిషనర్ల వాదనను ఖండించిన ప్రభుత్వం తరఫున న్యాయవాదులు.. జీవో 33 ప్రకారం ఇందిరమ్మ కమిటీల్లో గ్రామస్థాయిలో సర్పంచి లేదాప్రత్యేక అధికారి, వార్డు స్థాయిలో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ ఛైర్మన్లుగా ఉండనున్నారని వెల్లడించారు. వీరికి తోడుగా.. గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు స్థానికులు ఉండనున్నట్లు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
పిటిషనర్లు చెబుతున్నట్లుగా.. ఇళ్లు లేని లబ్దిదారుల్ని గుర్తించి, తుది జాబితా తయారీలో ఇందిరమ్మ కమిటీల నిర్ణయమే అంతిమం కాదని వెల్లడించింది. ఈ కమిటీలు రూపొందించిన అర్హుల జాబితాపై.. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డు స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తారని తెలిపారు. దీనివల్ల పిటిషనర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగదని భరోసా కల్పించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. ప్రభుత్వ జీవోను రద్దు చేయడం వీలుకాదని వెల్లడించింది.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు.. కారణం ఇదే!
కార్యనిర్వాహక వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలను తాము నిర్దేశించలేమని తెలిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ ఉద్దేశంలో తప్పులు లేవని వెల్లడించింది. ఈ కమిటీల ద్వారా కేవలం అర్హుల ఎంపికలో సాయం మాత్రమే తీసుకొంటున్నారని అందులో తప్పులేదని తెలిపింది. రాష్ట్రంలో ఎక్కడైనా.. అనర్హులను ఈ జాబితాలో చేర్చి ప్రయోజనం చేకూర్చాలనుకుంటే.. కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.