Lokesh on Ys Jagan: సండే ఈజ్ హాలిడే అంటారు కదా.. కానీ ఈ ఇద్దరి నేతల కామెంట్స్ తో సండే ఈజ్ కామెంట్స్ డే గా మార్చారు. ఒకరేమో విద్యా శాఖ భ్రష్టు పట్టిందని, మరొకరేమో ఇది నీ పాపాల చిట్టా అంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. వారెవరో కాదు మాజీ సీఎం జగన్, మంత్రి లోకేష్. అర్థరాత్రి ఆత్మలతో మాట్లాడే అలవాటు నీది. ఆత్మలతో చర్చలు నిర్ణయాలు ప్రకటించడం నీకే అలవాటు మాది కాదు. ఐదేళ్ల పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి.. నేడు బంగారు పలుకులు అవసరమా జగన్ అంటూ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఇంతలా లోకేష్ ఆగ్రహం ఎందుకంటే..
మాజీ సీఎం జగన్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. అది కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, మూడు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. విద్యార్థులపై సీఎం చంద్రబాబు కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అంతా స్కాముల మయమైందని, వెంటనే అమ్మకు వందనం, వసతి దీవెన, ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలని జగన్ డిమాండ్ చేశారు.
జగన్ అలా ట్వీట్ చేసిన వెంటనే లోకేష్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. చిన్నపిల్లలకు అందించిన చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన సుప్పుని సుద్ధపూస అంటారని జగన్ ను ఉద్దేశించి లోకేష్ విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో రూ. 3500 కోట్లు బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే నేడు విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు.
Also Read: Pawan Kalyan Warning: అలా చేస్తే మీరు జనసైనికులే కాదు.. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
తాను యువగళం పాదయాత్ర చేపట్టిన సమయంలో విద్యార్థులు తమ సమస్యను తన దృష్టికి తెచ్చారని, అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. అలాగే విద్యార్థుల సర్టిఫికెట్లను ఏ కళాశాల యాజమాన్యం కూడా ఇబ్బందులు పెట్టకుండా అందించాలని అన్ని కళాశాలలను ఆదేశించామన్నారు. ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును నేరుగా కళాశాలలకు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ఇక జగన్ ను ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ.. అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం నిర్ణయాలు తీసుకొని, వైసీపీ పాలనలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. వైసీపీ చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరి చేస్తూ ప్రణాళిక బద్ధంగా తాము ముందుకు సాగుతున్నామని, తప్పుడు ప్రచారాలు చేయడంలో ఇంకా తన నైజం జగన్ మార్చు కోలేదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పడం జగన్ అలవాటు చేసుకోవాలని సూచించారు. మొత్తం మీద వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ సండే రోజు వాడివేడిగా సాగింది.