Farmer Issues: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, వరి వేస్తే ఉరి తప్పదని గత ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇక రైతులను ఆదుకుంటానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తీరా అధికారం వచ్చాక మోసం చేసిందని మండిపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకున్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని ఆయన వెల్లడించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వరంగల్ డిక్లరేషన్ అంటూ చెప్పడం తప్పితే కాంగ్రెస్ రైతులకు చేసిందేమీ లేదన్నారు. అందుకే రైతుల సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా బీజేపీ నేతలంతా సోమవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నట్లు చెప్పారు. రైతులను స్వయంగా కలిసి వారి కష్టాలు తెలుసుకుంటామని కొండా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గన్నీ సంచులు, సుతిలి దారం కూడా ఇవ్వడంలేదని, లారీలు కూడా అంటుబాటులో లేవని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ చేపడుతున్న రైతు ఘోష.. బీజేపీ భరోసా తొలిరోజు పర్యటన తన పార్లమెంట్ పరిధిలో చేవెళ్లలో ఉందని వెల్లడించారు.
అనంతరం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంలో విఫలమైందని మండిపడ్డారు. రైతులను దళారులు మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 30 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని, కానీ సీఎం 80 శాతం కొనుగోలు చేశామని అబద్ధం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎంకు.. అధికారులు సరైన లెక్కలు ఇవ్వడం లేదా? అని ఏలేటి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఎందుకు గోస పెడుతోందని ప్రశ్నించారు. ప్రతి గింజ కొంటామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని, వడ్లకు బోనస్ అన్నారని.. ఆ హామీలన్నీ ఏమయ్యాయని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.
Also Read: ప్రపంచంలో ఎక్కువ బైక్‌లు ఉన్న దేశం ఏదో తెలుసా? భారత్ ఏ స్థానంలో ఉందంటే?
రాష్ట్ర ప్రభుత్వం దళారులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వర్షాలు కురుస్తున్నాయనే భయంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తేమ పేరిట ఒక్కో సంచికి 4 కిలోలు తీసేస్తున్నారని, మరి ఆ ధాన్యం డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయని ఏలేటి ప్రశ్నించారు. ఆరుగాలం కష్టపడి ధాన్యం పండిస్తే కూడా రైతులకు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. వరంగల్ లో రాహుల్ గాంధీతో కూడా అబద్ధం చెప్పించారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అకాల వర్షాలతో కొందరు, పంట కాలి ఇంకొందరు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళారుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నట్లు అర్థమవుతోందని ఏలేటి విమర్శించారు.
మొక్కజొన్న, జొన్న పంటను కూడా పూర్తిగా కొనుగోలు చేయకుండా సర్కార్ చేతులెత్తేసిందని మండిపడ్డారు. 4.8 లక్షల పొద్దు తిరుగుడు పువ్వు పంట వేస్తే.. కొంత మాత్రమే కొనుగోలు చేసి రైతులను గాలికొదిలేశారన్నారు. అందుకే చేవెళ్ల నుంచి రైతు ఘోష.. బీజేపీ భరోసా యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. మూడ్రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ కదులుతోందని తెలిసి పలు జిల్లాల కలెక్టర్లలో కదలిక వచ్చి కొనుగోళ్లు చేస్తామని చెప్పారని, రైతు సమస్యలు పరిష్కారమయ్యే వరకు కాంగ్రెస్ ను విడిచేది లేదని ఏలేటి హెచ్చరించారు. 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. అసలు కేటీఆర్ కు తెలంగాణ గురించి తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఆయనకు తెలంగాణ గురించి తెలియకుంటే ఆయన తండ్రి కేసీఆర్ ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని కేటీఆర్ కలలు కంటున్నారని చురకలంటించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయడం లేదనే అధికారం నుంచి తొలగించారని, ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చురకలంటించారు.
Also read: Jeevan reddy: ఇదేనా మీ ఆర్ఆర్ ట్యాక్స్?.. సర్కార్ పై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!