BRS Party: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు గులాబీ కేడర్ లో నిరాశ మిగిల్చింది. మెజార్టీ సీట్లు కైవసం చేసుకొని పార్టీలో జోష్ నింపుతుందనుకున్నప్పటికీ సాధించలేకపోయింది. కేవలం 17 మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించామని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఓటింగ్ శాతం సైతం ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నాంది అని పేర్కొన్నప్పటికీ ఆ స్థాయిలో రాణించలేకపోయింది. ఇప్పటికే నిరాశలో ఉన్న కేడర్‌ను మరింత నైరాశ్యంలోకి నెట్టింది.
బీఆర్ఎస్ పార్టీ అర్బన్ ప్రాంతాలపై ఆశలు పెట్టుకుంది. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి కలిసి వస్తుందని భావించింది. తాము ప్రచారం చేయకున్నా గెలుస్తామని ధీమాను వ్యక్తం చేసింది. అయితే బీఆర్ఎస్(BRS) అంచనాలు రివర్స్ అయ్యాయి. 30కి పైగా సీట్లు సాధిస్తామని పోలింగ్ తర్వాత రిపోర్టు తెప్పించుకొని ధీమా వ్యక్తం చేసింది. అయితే అందులో సగం స్థానాలకే (17) పరిమితం కావడంతో ఇప్పుడు గులాబీపార్టీలో చర్చజరుగుతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉప్పుడు 90స్థానాలకు పైగా విజయం సాధించింది. ఇప్పుడు అమాంతంపడిపోవడంతో పార్టీ నేతల్లో చర్చకు దారితీసింది. కేవలం ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 10లక్షల 87వేల 347 ఓట్లు సాధించింది. 28.7శాతం మాత్రమే వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 37.35శాతం ఓట్లు వచ్చాయి. అంటే సుమారు 9శాతం ఓట్లు తగ్గాయి. పెరగాల్సిన ఓట్లు తగ్గడం ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీసింది.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారం చేస్తారని పార్టీ తొలుత లీకులు ఇచ్చింది. నీళ్లపై నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోనూ సభలు నిర్వహిస్తారని, ప్రభుత్వం ప్రాజెక్టులపై అనుసరిస్తున్న విధానాలను ఎండగడతారని పేర్కొంది. అయితే నోటిఫికేషన్ కు ముందే సభలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పినప్పటికీ నిర్వహించలేదు. కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయలేదు. దీనికి తోడు పార్టీలోని కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు సైతం వారి సొంత జిల్లాలపైనే ఫోకస్ పెట్టారు. ఆ మున్సిపాలిటీల్లోనే విస్తృత ప్రచారం చేపట్టారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయకపోవడంతోనే పార్టీకి మున్సిపాలిటీల్లో కలిసి రాలేదనే ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలను మాజీ మంత్రులకు అప్పగిస్తే వారు సైతం చోద్యంచూడటం, వారి నియోజకవర్గాల్లోనిమున్సిపాలిటీలకే పరిమితం అయ్యారు. దీంతో అధికార పార్టీకి ధీటుగా ప్రచారం చేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి స్థానిక నేతలు తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో వెళ్లలేదని పార్టీ కేడర్ అభిప్రాయపడుతుంది.
Also Read: Whispering Nandi: శివాలయంలో నంది చెవిలో రహస్య విన్నపాలు, అసలు కారణం ఏంటి?
కేవలం ఎన్నికలప్పుడే పార్టీ అధిష్టానం హడావుడి తప్ప ఆ తర్వాత చేతులెత్తేస్తుంది. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టకపోవడం, కమిటీలు వేయకపోవడం, ప్రజావ్యతిరేక అంశాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లకపోవడంతోనే ప్రజలు గులాబీ పార్టీ వైపునకు ఆసక్తి చూపలేదని ప్రచారం జరుగుతుంది. పార్టీలో ఇప్పటివరకు ఏం జరుగుతుందనేది క్షేత్రస్థాయిలో తెలుసుకోకపోవడం, కేవలం కొందరి నేతలు చెప్పిన మాటలనే విశ్వసిస్తుండటంతోనే పార్టీ రోజురోజుకు బలహీన పడుతుందనే పలువురు నేతలు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓటమిపై ఉమ్మడి జిల్లాల వారీగా నేతలు, కీలక కార్యకర్తలతో తెలంగాణ భవన్ లో సమీక్షలు నిర్వహించింది. ఓటమికి గల కారణాలను ఆరా తీసింది. పీడ్ బ్యాక్ తీసుకుంది. కానీ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయలేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది మౌఖికంగా, మరికొందరు పేపర్లలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను పార్టీ అధిష్టానంకు అందజేశారు. కానీ వాటిని బుట్టదాఖలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆతర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఘోర ఓటమిని చవిచూసింది. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక స్థానంలో విజయం సాధించకపోగా మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు సైతం కోల్పోయింది. ఆ తర్వాత సమీక్షించుకుంటారని భావించినప్పటికీ ఆదిశగా చర్యలు చేపట్టలేదని సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం మద్దతు దారులు 4వేల గ్రామాల్లో విజయం సాధించడంతో కొంత ఊరటనిచ్చింది. ఈ మున్సిపల్ ఎన్నికలు మాత్రం కేడర్ ను నిరాశపరిచాయి. ఇప్పటికైనా ఈ ఫలితాలపైపార్టీ అధిష్టానం సమీక్షించి పార్టీపై దృష్టిసారిస్తుందా? లేదా? అనేది చూడాలి.