BRS Strategy: స్వేచ్ఛ బ్యూరో: గులాబీ అధిష్టానం ఎట్టకేలకు సంస్థాగతంపై దృష్టిసారించబోతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతుంది. కేడర్ కు నేతల మధ్య ఉన్న అంతరాలను సరిద్దబోతుంది. అందుకు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే సమావేశంను వేదికగా మల్చుకోబోతుంది. పార్టీ ఎన్నికల నాటికి ఏయే కార్యక్రమాలు చేపట్టాలి.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలనేదానిపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్ గా పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించబోతున్నారు. తొలిసారి ఇలా నిర్వహిస్తుండటం ఇప్పుడు పార్టీలోనే చర్చకుదారితీసింది.
ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చింది. 2018లో సైతం తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే పార్టీ బలోపేతంపై మాత్రం దృష్టిసారించలేదు. కమిటీలు సైతం పూర్తి స్థాయిలో వేయలేదు. కేవలం గ్రామ, మండలాలకు అధ్యక్షులను, నియోజకవర్గాలకు ఇన్ చార్జులను, జిల్లాకమిటీకి అధ్యక్షులను మాత్రమే నియమించింది. అనుబంధ కమిటీలను సైతం నియమించలేదు. దీంతో పనిచేస్తున్న నేతల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పార్టీ ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి నెలకొంది.
దీనికి తోడు ఎమ్మెల్యేలే నియోజకవర్గానికి ఇన్ చార్జులుగా ఉండటంతో మరో నేతలను ఎదగనివ్వలేదు. గ్రూపులను సైతం ప్రోత్సహించడంతో నియోజకవర్గాల్లోని పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. ఆ ఎఫెక్ట్ 2023 ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అయింది. అయినప్పటికీ రెండన్నరేళ్లుగా పార్టీ బలోపేతం దృష్టిసారించలేదు. సమీక్షలు సైతం చేయలేదు. అయితే రాబోయే ఎన్నికలకు సైతం మరో రెండేళ్లు మాత్రమే ఉండటంతో క్షేత్రస్థాయిలో బలోపేతం చేపట్టాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ సైతం కేడర్ కు నేతల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఓడిపోయామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీని గాడిలో పెట్టేందుకు సిద్ధమవుతున్నవారు.
Also Read: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..?
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలని గులాబీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి, పార్టీ శ్రేణులను నేరుగా ప్రజల వద్దకు పంపేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. పార్టీ కేడర్‌లో నూతన ఉత్తేజం నింపేందుకు, ప్రజలతో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు సన్నద్దమవుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన కార్యక్రమాల కరపత్రాలు, ప్రభుత్వ వైఫల్యాలను సైతం వివరించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రతి ఏటా ఏప్రిల్ 27న ఘనంగా నిర్వహించే పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఈసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ సభ గానీ, ప్లీనరీ సమావేశం గానీ నిర్వహించడం లేదు. ఆర్భాటాలకు పోకుండా కేవలం పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టాలని అధిష్టానం భావిస్తోంది. ఈ నెల 20న జగిత్యాల సభ నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను కేసీఆర్ వివరించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. అయితే ఈ నెల 27న నిర్వహించే పార్టీ ఆవిర్భావంను పురస్కరించుకొని నిర్వహించే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. నేతల తప్పిదాలను సైతం ఎండగట్టి.. చేపట్టే కార్యక్రమాల వివరాలను సైతం కేసీఆర్ వెల్లడించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనే అంశంపై పార్టీ కేడర్‌లో తీవ్ర ఆసక్తి నెలకొంది. పార్టీలో జవసత్వాలు నింపేలా కొత్త కమిటీల నియామకం లేదా బాధ్యతల మార్పుపై ప్రకటన ఉంటుందా? అని నేతలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సభ్యత్వ నమోదు ద్వారా పార్టీని గ్రామ గ్రామానికి ఎలా తీసుకెళ్లాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలను కేసీఆర్ ఈ సమావేశంలో వివరించే అవకాశం ఉంది.
Also read: గాంధీ భవన్ నుండి సీక్రెట్ ఆర్డర్స్.. రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్ హీట్..?